ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్టీఆర్ యునివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. యూనివర్సిటీ పేరును వైఎస్సార్ యునివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా మార్చారు. ఇందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ నిర్ణయం తీసుకోబోయే ముందు తనను తాను అనేక సార్లు ప్రశ్నించుకున్నాను అని జగన్ అసెంబ్లీలో వెల్లడించారు. అంతేకాక ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో గౌరవం అని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. క్రిష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టమని తనను ఎవరూ అడగకపోయినా.. ఎన్టీఆర్ మీద గౌరవంతోనే పాదయాత్ర సమయంలో తనే హామీ ఇచ్చానని గుర్తు చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో తన మాట నిలబెట్టుకున్నానని వెల్లడించారు. అంతేకాక ఎందుకు యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెడుతున్నారో కూడా ఈ సందర్భంగా జగన్ వివరించారు.
సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘నేను ఎన్టీఆర్ ప్రతిష్టను తగ్గించాలి అనుకోవడం లేదు. ఆయన అంటే నాకు ఎంతో గౌరవం. అందుకే కొత్త జిల్లాకు ఆయన పేరు పెట్టాను. ఇక హెల్త్ యూనీవర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడానికి బలమైన కారణాలు ఉన్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఉమ్మడి ఏపీలో వైద్యం రంగం బలోపేతానికి ఎంత కృషి చేశారో అందరికి తెలుసు. ఒకప్పుడు పేద, మధ్యతరగతి వారికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తే.. చావే శరణ్యం అనేటటువంటి పరిస్థితులు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖర్చు భరించలేరు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పట్టించుకునే నాథుడు కరువు. పాదయాత్ర సమయంలో ఈ పరిస్థితులను గమనించిన వైఎస్సార్.. అధికారంలోకి రాగానే ఆరోగ్య శ్రీ వంటి అతిగొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందించారు. ఎందరో ప్రాణాలు కాపాడి.. ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపారు’’ అని చెప్పుకొచ్చాడు.
‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వయంగా డాక్టర్. మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించాడు. ఆయన చేసిన మేలుకు కృతజ్ఞతగా జనాలు వైఎస్సార్‌ను ఎమ్మెల్యేగా గెలిపించారు. అప్పటి నుంచే ఆయన సామాన్యుల జీవితంలో వైద్యానికి ఎంత ప్రాముఖ్యత ఉందో గుర్తించాడు. అధికారంలోకి వచ్చాక వైద్య రంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రమాదంలో చిక్కుకుని ఇబ్బంది పడేవారిని.. అత్యవసర వైద్య సహాయం కావాల్సిన వారికి సాయం చేయడం కోసం 108, 104 సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఫలితంగా మారుమూల ప్రజలకు తక్షణ వైద్య సహాయం అందుతుంది. అన్ని రకాల ఎమర్జెన్సీ పరిస్థితులను హ్యాండిల్ చేయగల సదుపాయాలు ఈ అంబులెన్స్‌లో ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు.
‘‘నాడు వైఎస్సార్ చేసిన ఈ ఆలోచన ఎంతో మంచి ఫలితాన్ని ఇవ్వడమే కాక దేశవ్యాప్తంగా అని రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తున్నాయి. ఇక నాన్నగారి బాటలోనే నేను పయనిస్తున్నాను. ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించడం కోసం వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ప్రారంభించాన. అలానే ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు మెరుగుపర్చడం కోసం నాడు-నేడు అమలు చేస్తున్నాను. ఇక ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసం తపించిన వైఎస్సార్ పేరు హెల్త్ యూనివర్సిటీకి పెట్టడం అన్ని విధాల సమంజసమే అనిపించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అని సీఎం జగన్ తెలిపారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.