మన సమాజంలో సినిమాలకు-రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. సినిమాల్లో స్టార్లుగా వెలుగొందిన కొందరు రాజకీయాల్లో కూడా అదే విధంగా రాణించారు. ఏకంగా సీఎంలుగా చేసిన వారు కూడా ఉన్నారు. ఇప్పటికి పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అయితే కొందరు స్టార్లు రాజకీయాలకు దూరంగా ఉన్నా సరే.. ప్రతి పార్టీ వారి క్రేజ్‌ను సొంతం చేసుకోవడానికి.. అభిమానులను ఆకట్టుకోవడానికి.. సదరు సెలబ్రిటీ తమ వాడే అని చెప్పుకోవడానికి తెగ ఆరాటపడతాయి. ఆయన ఒక్క మాట చెబితే చాలు తమకు అదే పదివేలు అన్నట్లు ఎదురు చూస్తాయి. తమ పార్టీకి మద్దతిస్తున్నట్లు ఒక్క ప్రకటన వచ్చినా చాలు అని ఆశపడతాయి. అయితే కొందరు స్టార్లు మాత్రమే ఇంతటి ఖ్యాతిని పొందుతారు.
అదిగో ఆ జాబితాలో నిలిచే స్టార్ హీరో చిరంజీవి. తెలుగు ప్రేక్షకుల మదిలో అన్నయ్యగా నిలిచిన చిరంజీవి.. ఇప్పుడు ఏపీలో రాజకీయ పార్టీల పాలిట ఆపద్బాంధవుడిగా మారాడు. ఆయన మావాడంటే మావాడు అని చాటుకోవడానికి ఏపీలోని రాజకీయ పార్టీలన్ని తెగ ఆరాటపడుతున్నాయి. తాజాగా చిరంజీవి బర్త్‌డే సందర్భంగా రాజకీయాల్లో బాస్ క్రేజ్ మరోసారి వెలుగులోకి వచ్చింది.
చిరంజీవి.. తెలుగు సినీ చరిత్రలో ఆయనదో ప్రత్యేక ప్రస్థానం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు కోసం తపనపడి.. అందుకోసం నిరంతరం శ్రమించి అంచెలంచెలుగా ఎదుగుతూ.. మెగస్టార్ రేంజ్‌కి ఎదిగారు. తెర మీద హీరోగానే కాక.. వాస్తవంగా తెర వెనక కూడా ఎందరికో సాయం చేస్తూ.. అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ.. రియల్ హీరోగా.. అభిమానుల్లో గుండెల్లో అన్నయ్యగా చెరగని ముద్ర వేసుకున్నాడు. అదిగో ఆ క్రేజ్‌ను వాడుకోవడం కోసం ఇప్పుడు ఏపీలోని ప్రతి రాజకీయ పార్టీ ఉబలాటపడుతుంది. ఆయనను తమ వాడిగా ప్రచారం చేసుకోవాలని బలంగా కోరుకుంటున్నాయి.
వైఎస్సార్‌సీపీ..
అధికార పార్టీని చిరంజీవిని తమ వాడిగా చెప్పుకోవడంలో ఎప్పుడు ముందు ఉంటుందే. ఈ సారి అయితే మరో అడుగు ముందుకు వేసి.. ఏకంగా వైసీపీ నాయకులు చిరంజీవి బర్త్‌డే వేడుకలను ఘనంగా చేశారు. వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని చిరంజీవి బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరపడం గమనార్హం. నానికి పవన్ అంటే అస్సలు పడదు. అలాంటిది ఆయన చిరంజీవి బర్త్‌డే చేయడం ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ చర్యలతో అధికార పార్టీ నేతలు చిరంజీవి తమ వాడని చెప్పుకునే ప్రయత్నం బలంగా చేస్తున్నాయి అని అర్థం అవుతోంది.
జనసేన..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. చిరంజీవికి సొంత తమ్ముడు. ప్రస్తుతం మెగా బ్రదర్ నాగబాబు పవన్‌కు మద్దతుగా.. జనసేన పార్టీలోనే ఉన్నారు. గతంలో ఓ సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ.. చిరంజీవి జనసేనకు మద్దతిస్తారని ప్రకటించాడు. ఈ క్రమంలో తాజాగా వైసీపీ శ్రేణులు చిరంజీవిని తమ వాడిగా చెప్పుకునే ప్రయత్నంలో ఉండటంతో.. కౌంటర్ దాడికి సిద్ధమైంది జనసేన.
సినిమా టికెట్ల రేట్ల అంశం సందర్భంగా ప్రభుత్వంతో చర్చల వేళ.. సీఎం జగన్.. చిరు పట్ల ఎలా ప్రవర్తించారో మరోసారి ప్రజలకు గుర్తు చేస్తున్నారు జనసేనాని. కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న చిరంజీవిని తన ముందు చేతులు కట్టుకునే పరిస్థితికి తీసుకువచ్చి సీఎం జగన్ దారుణంగా అవమానపర్చారని ఆరోపిస్తున్నాడు. చిరంజీవిని అవమానించి సీఎం జగన్ తన అహంకారాన్ని సంతృప్తి పరుచుకున్నాడని పవన్ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో.. ఆయనపై లేని ప్రేమ కురిపిస్తున్నారని మండిపడుతున్నారు.
టీడీపీ..
ఇక చిరంజీవి విషయంలో టీడీపీ ఎప్పుడూ సానుకూలంగానే ఉంది. చిరంజీవి చేసే మంచి పనులను ప్రశంసించడంలో కానీ.. వివాదాల సమయంలో ఆయనకు అండగా నిలబడటంలో కానీ ఎప్పుడు ముందే ఉంటుంది. టీడీపీ అధినేతకు చిరంజీవి ఎల్లప్పుడు ఇష్టుడే.
మరి చిరంజీవి దారెటు..
పార్టీలన్ని ఇలా చిరంజీవిని మావాడంటే మావాడు అని కొట్టుకుంటున్నాయి. మరి ఇంతకు మెగస్టార్ మదిలో ఏముంది.. ఆయన ఏ పార్టీ వైపుకు మొగ్గు చూపుతున్నారు అనేది మాత్రం అర్థం కావడం లేదు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో పార్టీ స్థాపించారు. కానీ అది అనుకున్న మేర సక్సెస్ కాలేదు. సుమారు దశాబ్దం పాటు రాజకీయాల్లో ఉండి.. అవి తనకు సరిపోవు అని అర్థం చేసుకుని.. బయటకు వచ్చేశారు. ఆ తరువాత ఆయన తన దృష్టినంతా సినిమాల మీదనే పెట్టారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
ఇక దాసరి నారాయణ మృతి తర్వాత ఇండస్ట్రీలో చాలా మంది చిరంజీవినే ఆ బాధ్యతలు తీసుకోవాలని కోరారు. కానీ ఆయన అంగీకరించలేదు. తనకు ఏ బాధ్యతలు వద్దని.. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా మాత్రమే ఉంటానని.. కానీ సమస్యలు వస్తే.. ముందు నిలబడి.. పోరాడతానని స్పష్టం చేశారు. అన్నప్రకారమే.. సినిమా టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వంతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి కృషి చేశారు. కరోనా సమయంలో ఎందరో సినీ కార్మికులును ఆదుకున్నారు. ఇక సామాన్యులకు కూడా ఎన్నో సార్లు సహాయం చేశారు. ఆయన స్థాపించిన బ్లడ్ బ్యాంక్ ఎందరో ప్రాణాలు కాపాడుతుంది.
ఇలా సినీ పరిశ్రమకు చెందిన వారికే కాక.. సామాన్యులకు కూడా తనకు తోచిన సాయం చేస్తూ.. ప్రజల ప్రేమాభిమానాలు సంపాదించుకున్న చిరంజీవి కోసం పార్టీలు పోటీ పడటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. మరి బాస్ మనసులో ఏం ఉంది.. ఏ పార్టీ వైపు ఆయన చూపు అనే విషయాల గురించి మాత్రం క్లారిటీ లేదు. మరి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో లోపు దీనిపై ఓ క్లారిటీ వస్తుందోమే చూడాలి. ఇలా రాజకీయ పార్టీలన్ని తమ అభిమాన హీరో కోసం పోటీ పడుతుండటం చూసి చిరు అభిమానులు గర్వంగా ఫీలవుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.