సీమ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు జేసీ సోదరులు. తమ సొంత పార్టీపై ఏమాత్రం మోహమాటం లేకుండా విమర్శలు గుప్పిస్తుంటారు. తాజాగా రాయలసీమ టీడీపీ నేతల సమావేశంలో తాడిపత్రి మున్సిపల్ ఛైర్‌పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీమలో ప్రాజెక్ట్‌ల కంటే ముందు కార్యకర్తలను కాపాడాలని హైకమాండ్‌ను కోరారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెలుగు దేశం పార్టీ మళ్లీ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. కార్యకర్తలు టీడీపీ నేతలను నమ్మటం లేదన్నారు.. చంద్రబాబు మేలుకోకపోతే కష్టమే అంటూ.. రాయలసీమ టీడీపీ నేతల సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం కమ్మభవన్‌లో సీమజలాలపై టీడీపీ సదస్సు నిర్వహించిందింది. ఈ సమావేశంలో మాట్లాడిన మాజీ జేసీ ప్రభాకర్ రెడ్డి.. మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్ వైఖరిని వ్యతిరేకిస్తూ సమావేశం నుంచి వెళ్లిపోయారు. మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. సమాచారం లేకుండానే మీటింగ్ నిర్వహిస్తున్నారన్నారంటూ.. ఆయన వైఖరిని వ్యతిరేకిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సమావేశానికి ఎవర్ని పిలిచారని ప్రశ్నించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇదంగా కాలువ శ్రీనివాసులు కనుసన్నల్లో జరుగుతోందని.. ఇలా అయితే కార్యక్తలు నిరుత్సాహానికి గురి అవుతారని.. ఇది సరైన పద్దతి కాదు.. ఎవర్ని పిలిచారో చెప్పాలన్నారు. రెండేళ్లుగా కార్యకర్తలు అరెస్ట్ అయితే ఒక్కరైనా వెళ్లి పరామర్శించారా అని ప్రశ్నించారు. సర్పంచ్ గా నిలబెట్టినారా.. వాళ్లకు సపోర్ట్ చేశారా అంటు ప్రశ్నలు సంధించారు. సమావేశంలో పెద్దవాళ్లు ఉన్నారని నోరు మూసుకుని వచ్చానని.. లేకపోతే చాలా మాట్లాడేవాడిని అన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా మేలుకోవాలని.. ఈ విషయాలపై దృష్టి సారించాలన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు.