ఇటీవలే ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణం నుంచి పాఠాలు నేర్చుకున్న కేంద్రం.. ఇక నుండి వెనుక సీట్లో కూర్చొనే వారు కూడా ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని నిబంధన పెట్టింది. అంతేకాదు కారులో ఎయిర్ బ్యాగ్స్ కంపల్సరీ అని సూచించింది కూడా. అయితే రోడ్డు భద్రత మీద అవగాహన కల్పిస్తూ.. రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ లో భాగంగా కేంద్రం ఒక ప్రకటన రూపొందించింది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో ఈ యాడ్ ను షూట్ చేయించింది. అయితే ఇదే ఇప్పుడు కేంద్రం పాలిట తలనొప్పిగా మారింది. ఈ ప్రకటన తీరుపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ఈ ప్రకటన వరకట్నాన్ని ప్రోత్సహించేలా ఉందని మండిపడుతున్నారు.
అంతలా విమర్శలు ఎదుర్కోవడానికి ఆ ప్రకటనలో ఏముందంటే.. కొత్త జంట కారు బ్యాక్ సీట్లో కూర్చుని ఉంటుంది. తన కూతురు పెళ్లి చేసుకుని కారులో అల్లుడితో కలిసి వెళ్లిపోతుంటే తండ్రి ఏడుస్తూ ఉంటాడు. పక్కనే పోలీస్ వేషంలో అక్షయ్ కుమార్ నిలబడి ఉంటారు. “రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్న కారులో కూతుర్ని, అల్లుడ్ని పంపిస్తున్నావ్.. యాక్సిడెంట్ అయితే వెనుక సీట్లో ఎయిర్ బ్యాగ్స్ లేవు. ప్రాణానికే ప్రమాదం” అని అక్షయ్ కుమార్ ఆ తండ్రితో అంటారు. రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్న కారు కాదు, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్న కారు కొని పంపించు” అని తండ్రితో అనగానే 6 ఎయిర్ బ్యాగ్స్ కలిగిన కారు వచ్చి ఆగుతుంది. ఆ కారులో కొత్త దంపతులు వెళ్ళిపోతారు. లాస్ట్ లో “మీ వాహనంలో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటే మీరు సేఫ్ గా ఉంటారు” అని అక్షయ్ కుమార్ చెబుతారు. ఇదే ఇప్పుడు బీజేపీ కొంప ముంచింది. ఈ యాడ్ ను నితిన్ గడ్కరీ తన సోషల్ మీడియా ఖాతాల్లో, యూట్యూబ్ అఫీషియల్ ఛానల్ లో పోస్ట్ చేశారు.
#Watch: Nitin Gadkari posts ad with Akshay Kumar promoting six airbags in car, but hinting at dowry
The advertisement has sparked a debate on social media because of suggestions that the car in question is being offered as dowry at a wedding. https://t.co/PdWy5IwBwI
— Scroll.in (@scroll_in) September 13, 2022
ఈ యాడ్ రోడ్ సేఫ్టీని ప్రమోట్ చేసే దాని కంటే వరకట్నాన్ని ఎక్కువగా ప్రోత్సహించేలా ఉందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ ప్రకటనతో తండ్రి.. తన కూతురికి కట్నం ఇవ్వాలి అని పోలీస్ తో చెప్పించడం ఏం బాలేదంటూ మండిపడుతున్నారు. కట్నాన్ని ఆపాల్సిన పోలీసే.. దగ్గరుండి ఇలా ప్రోత్సహించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ప్రకటనలో అలాంటి ఉద్దేశం ఏమీ లేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రకటనలో కట్నం కంపల్సరీ అని ఎక్కడా చెప్పలేదని, పైగా తండ్రి ధనవంతుడు.. ధనవంతులకి వరకట్న సమస్యలు ఏమిటని తిరిగి బీజేపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
ఉన్నవాళ్లు అల్లుడికి కారు పెట్టడం అనేది మామూలే అని, అయితే ఆ పెట్టేదేదో కాస్త ప్రాణానికి భద్రత ఇచ్చే కారు పెడితే బాగుంటుందని ఈ ప్రకటన చేశాము గానీ వేరే ఉద్దేశం లేదని, ప్రతిపక్షాలు అనవసరంగా దీన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నాయని బీజీపీ వర్గాల్లో వాదన వినిపిస్తోంది. మరి అక్షయ్ కుమార్ తో చేసిన ఈ యాడ్ వరకట్నాన్ని ప్రోత్సహించే విధంగా ఉందా? లేదా? మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.