కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు కన్నడ నటి దివ్య స్పందన అలియాస్ రమ్య. ఇంతకు ఆమె ఎవరునుకుంటున్నారా.. సూర్య సన్నాఫ్ కృష్ణన్ లో నిదరే కల అయినదీ, కలయే నిజమైనది పాటలో కనిపించిన నటినే రమ్య. అయితే ఆమె రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి విదితమే. అయితే ఓ ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ఇప్పుడంటే వృద్ధాప్య పార్టీగా, పేలవమైన పనితీరుతో కనిపిస్తుందీ కానీ.. స్వాతంత్ర్యం రాకముందు నాటి నుండి మోడీతో కూడిన బీజెపీ అధికారంలోకి వచ్చేంత వరకు ఆ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అయితే పలు రాష్ట్రాల్లో అధికారం కోల్పోతూ నీరసంలో కూరుకుపోతున్న కాంగ్రెస్‌లో జవసత్వాలు నింపేందుకు ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొంత ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుండి కాశ్మీర్ పర్యటన చేశారు. అయితే రాహుల్ గాంధీనుద్దేశించి ఓ నటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పారు. ఇంతకు ఆమె ఎవరంటే..? రాహుల్ గాంధీ గురించి ఆమె ఏమన్నారంటే..?
‘నిదరే కల అయినదీ, కలయే నిజమైనది! బతుకే జత అయినదీ, జతయే అతనన్నది’ సూర్య సన్నాఫ్ కృష్ణన్ లో ఈ పాట ప్రతి ఒక్కరికీ ఇష్టమే. ఆ పాటలో నటించిన హీరో హీరోయిన్లు తమిళ నటుడు సూర్య, నటి రమ్య అలియాస్ దివ్య స్పందన. ఆ పాటలో ఆమె చాలా క్యూట్ గా కనిపిస్తారు. రమ్య కన్నడ నటి.దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ అభి సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు దివ్య స్పందన. కాగా, తెలుగులో సైతం కళ్యాణ్ రామ్ నటించిన అభిమన్యుతో పాటు అమృత వర్షం అనే సినిమాలో నటించారు. అయితే తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో ఎక్కువగా కనిపించారు. అనంతరం ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2012లో కాంగ్రెస్ లో చేరిన రమ్య.. కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గం నుండి లోక్ సభ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఇటీవల తన జీవితంలో ఎదురైన చేదు సంఘటనలు గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
‘నాకు నా తల్లిదండ్రులే ప్రాణం. నాన్న చనిపోయిన రెండు వారాలకే నేను పార్లమెంటులో అడుగుపెట్టాల్సి వచ్చింది. కానీ పార్లమెంటు కార్యకలాపాల గురించి నాకు కొత్త. ఏమీ తెలియనప్పటికీ.. ప్రతీదీ నేర్చుకున్నాను. నేను నా బాధను పనివైపు మళ్లించాను. అంతటి శక్తిని నాకు మాండ్యా ప్రజలే ఇచ్చారు. జీవితంలో నన్ను ఎక్కువ ప్రభావితం చేసిన వ్యక్తుల్లో అమ్మానాన్నల తర్వాత రాహుల్ గాంధీనే. నాన్న మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. మరోవైపు ఎన్నికల్లో ఓడిపోయాను. అలాంటి కష్ట సమయంలో రాహుల్ గాంధీ నాకు అండగా నిలబడి సహాయం చేశారు. మానసికంగా ధైర్యాన్ని నూరిపోసి సపోర్ట్ చేశారు’ అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ సోషల్ మీడియా అధ్యక్షురాలిగా ఉన్న ఆమె.. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో… ఆమె ఆ పదవికి రాజీనామా చేశారు. 2016లో సినిమాల్లో కనిపించిన ఆమె.. చాన్నాళ్ల గ్యాప్ తర్వాత ఉత్తరాఖండ అనే సినిమాల్లో నటించబోతున్నారు.