ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఎవరికి వారు ఇప్పటి నుంచే ప్రచారాలు మొదలు పెట్టేశారు. ఇవాళో, రేపో ఎన్నికలు అన్న విధంగా పని చేస్తున్నారు. ఎవరికి వాళ్లు తామే అధికారంలోకి వస్తామంటూ కామెంట్స్ చేస్తున్నారు. అధికార- ప్రతిపక్షాలు విమర్శలు- ప్రతి విమర్శలతో హీట్ ని పెంచేస్తున్నాయి.
పవన్ కల్యాణ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా అటు సినిమాల్లో, రాజకీయ నాయకుడిగా ఇటు ప్రజల్లో తనదైన ముద్ర వేశారు. సినిమాల్లో నటిస్తూనే.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఒక్క పదవి లేకపోయినా.. పదేళ్లుగా ప్రజల తరఫున నిలబడ్డారు. మా నమ్మకం పవన్.. మా భవిష్యత్ పవన్ అంటూ జనసైనికులు సైతం ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ప్రశ్నించడం కోసం వచ్చాం అన్న పవన్.. ఇప్పుడు సీఎం అవ్వడమే లక్ష్యం అని వ్యాఖ్యానించారు. మీరు ఓటేయండి సీఎం అయి చూపిస్తానంటూ భరోసానిచ్చారు. ఇప్పుడు నటుడు శివాజీ కూడా పవన్ సీఎం అవుతారంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
నటుడు శివాజీ తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై తన అభిప్రాయాలను వ్యక్త పరుస్తూ ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయ పరిస్థితులపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. “పవన్ ఒక వ్యక్తి కాదు.. ఒక శక్తి. ఆయన పిలిస్తే పార్టీలతో సంబంధం లేకుండా రోడ్ల మీదకు వచ్చి ఆయనకు మద్దతు తెలిపే వాళ్లు చాలా మంది ఉన్నారు. జనసేనకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఆ పార్టీకి మద్దతు తగ్గడం, పెరగడం అంటూ ఏమీ లేదు. వాళ్ల ఓట్ బేస్ వాళ్లకు ఉంది. పంచాయితీ ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో వారి ఉనికి చాటుకున్నారు. ఆయన తల్చుకుంటే కచ్చితంగా సీఎం అవ్వగలరు. ఆయన తల్చుకుంటే ప్రత్యేక హోదా అవుతుంది.. అమరావతి అవుతుంది.. విశాఖ ఉక్కు కూడా అవుతుంది.
నాకు జనసేన పార్టీలో చేరాలని.. ఆయనతో ఉండాలి అనేం లేదు. మన దగ్గర అస్త్రం ఉంటే దానిని సరిగ్గా వాడుకోవాలి అనేది నా తాపత్రయం” అంటూ శివాజీ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకున్న విషయం తెలిసిందే. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలు ఇవాళో, రేపో అన్న విధంగా పని చేస్తున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలు, సభలు, సమావేశాలు అంటూ జోరు పెంచేశారు. ఓటరు నాడి పట్టుకునేందుకు తమదైన శైలిలో పని చేస్తున్నారు. అన్ని పార్టీల కార్యకర్తలు, శ్రేణులు తమ పార్టీ విజయం సాధించాలంటూ ఇప్పటి నుంచే ప్రచారాలు, సోషల్ మీడియా పోస్టులు ప్రారంభించేశారు.