ఏపీ రాజకీయాల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ట్యాపింగ్ వివాదం పెను దుమారం రేపుతోంది. తన ఫోన్‌ను ట్యాప్ చేశారని కోటంరెడ్డి ఆరోపిస్తున్నారు. తనకు పార్టీలో సముచిత స్థానం లేదని అంటూ టీడీపీలో చేరేందుకు సిద్ధమాయ్యారు. చంద్రబాబు చెప్పిన చోటు నుంచి పోటీ చేస్తానని అన్నారు. ఇక, అధికార పక్షం కోటంరెడ్డి ఆరోపణలు తప్పుబడుతోంది. కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్‌కు గురి కాలేదని, ఆయన మిత్రుడే కాల్స్ రికార్డు చేశాడని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కోటంరెడ్డి ‘‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’’లో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలను ఆయన వెల్లడించారు.
అంతేకాదు! ఈ సందర్బంగా సీఎం జగన్‌కు, ఏబీఎన్ రాధాకృష్ణలకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఏబీఎన్ రాధాకృష్ణను కలవాలని అనుకున్నారంట. అయితే, రాధాకృష్ణ ఇందుకు ఒప్పకోలేదంట. ఇదే విషయాన్ని స్వయంగా ఏబీఎన్ రాధాకృష్ణ వెల్లడించారు. ఇంటర్వ్యూలో కోటంరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ రామోజీరావు దగ్గరకు జగన్‌మోహన్‌రెడ్డి గారు వెళ్లినపుడు.. నేను నేరుగా జగన్ గారికి చెప్పాను. మంచి పని చేశారన్న అని అన్నాను. అదే విధంగా రాధాకృష్ణ గారిని కూడా ఆలోచన చేయమని చెప్పాను’’ అని అన్నారు. దీనికి రాధాకృష్ణ స్పందిస్తూ..
‘‘ నేను, జగన్ ఉత్తర దక్షిణ దృవాలము.. కలవటం సాధ్యం కాదు. అందుకని అతను వస్తాను అన్నా.. నేను వద్దని చెప్పాను’’ అని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్‌గా మారాయి. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే, రాధాకృష్ణ అంటున్న వ్యాఖ్యల్లో నిజం ఎంతుందన్నది ఆ దేవుడికే తెలియాలి. ఈ వ్యాఖ్యలపై అధికార పక్షం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మరి, సీఎం జగన్ వచ్చి తనను కలుస్తానంటే.. తానే వద్దన్నానన్న ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.