కడప జిల్లాలో మొదటి నుంచి వైఎస్ కుటుంబం హవా బలంగా ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పటికి.. కడపలో మాత్రం వైఎస్ కుంటుంబమే విజయం సాధిస్తూ వస్తోంది. వైసీపీకి కంచుకోటలా మారింది. ఇక ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవం చవి చూసింది. ఓటమి తరువాత చాలా మంది టీడీపీ నేతలు పార్టీకి దూరం అయ్యారు.. కొందరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం చాలా జిల్లాల్లో టీడీపీకి ఇంచార్జిలు కూడా లేరు. అలాంటిది వైసీపీకి కంచుకోటలా ఉన్నా కడప జిల్లాలో టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
కడప జిల్లాలో పార్టీని బలోపేతం చేసే నేతలు ఎవరైనా ఉన్నారా అన్న ప్రశ్నకు టీడీపీ వాళ్లే ఆన్సర్ చెప్పే పరిస్థితి లేదు. గత 20 ఏళ్లలో ఆ పార్టీ కడపలో సాధించిన అతిపెద్ద విజయం ఏంటంటే ఒక్క అసెంబ్లీ సీటే. ఓ సారి కమలాపురంలో మాత్రమే గెలిస్తే.. 2009లో ప్రొద్దుటూరులో గెలిచింది. నంద్యాల వరదరాజులరెడ్డి ఆరుసార్లు ప్రొద్దుటూరు నుండి శాసనసభకు ఎంపికయ్యడు. 2009లో జరిగిన ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం అభ్యర్థి మల్లేల లింగారెడ్డి చేతిలో ఓడిపోయాడు. జగన్ కు, వరదరాజులకు మధ్యలో ఉన్న విబేధాల కారణంగానే ఆయన ఓడిపోయాడని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. ఇక 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా.. రాజంపేటలో మాత్రమే విజయం సాధించగా.. 2019 ఎన్నికల్లో అది కూడా పోయింది. కడప, రాజంపేటలో గెలిచి 20 ఏళ్లు దాటుతోంది. ఇది కడపలో స్థూలంగా టీడీపీ రాజకీయ చరిత్ర.
ప్రస్తుతం మిగతా జిల్లాలతో పోల్చుకుంటే.. కడపలో టీడీపీ పరిస్థితి మెరుగ్గా ఉందని.. ఇప్పుడక్కడ పార్టీని బలోపేతం చేసే ముగ్గురు యువనేతలు పార్టీకి ఆశాకిరణాలుగా కనిపిస్తున్నారని కేడర్ భావిస్తోంది. ఈ ముగ్గురు యువనేతలు ఇలానే కష్టపడితే.. జిల్లాలో టీడీపీ ఖాతాలో ఒకటి, రెండు విజయాలు ఖాయం అనే టాక్ జిల్లాలో బలంగా వినిపిస్తోంది. విచిత్రం ఏంటంటే టీడీపీ కేడర్ ఆశలు పెట్టుకున్న ఆ ముగ్గురు నేతలు కూడా సీఎం జగన్ సామాజిక వర్గానికి చెందిన వారే. ఆ ముగ్గురు ఇప్పుడు మూడు నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా కూడా ఉన్నారు. వారే ప్రొద్దుటూరు ఇన్‌చార్జ్ ఉక్కు ప్రవీణ్‌రెడ్డి, కడప ఇన్‌చార్జ్ బీటెక్ రవి, జమ్మలమడుగు ఇన్‌చార్జ్ దేవగుడి భూపేష్‌రెడ్డి.
ఇది కూడా చదవండి : ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం! CBN ను కలిసిన YSR ఆత్మ!
ప్రొద్దుటూరు ఇంచార్జ్ ఉక్కు ప్రవీణ్‌రెడ్డి
ఈ ముగ్గురిలో ముందే ఇన్‌చార్జ్‌గా నియమితులైన ప్రవీణ్‌రెడ్డి నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి సోదరుడి కుమారుడు అయిన ప్రవీణ్‌రెడ్డి కడప ఉక్కు నినాదంతో జిల్లాతో పాటు సీమ అంతా హైలెట్ అయ్యారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రవీణ్‌కు జిల్లా వ్యాప్తంగా యువతలో మంచి క్రేజ్ ఉంది. ప్రొద్దుటూరు అధికార పార్టీలో గ్రూపు విబేధాలు, ఎమ్మెల్యే రాచమల్లు రెండుసార్లు గెలవడం, వ్యతిరేకతతో కొట్టుమిట్టాడుతూ ఉండడం.. ప్రవీణ్ కు కలిసి వచ్చే అంశాలు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి వర్గం ప్రవీణ్ కు మద్దతు ఇవ్వకపోడం ఒక్కటే మైనస్ అంటున్నారు. టీడీపీ అధిష్టానం దీనిపై దృష్టి పెట్టి.. వీరిని సెట్ చేస్తే 2009లో ఇక్కడ టీడీపీ చేసిన మ్యాజిక్ మరోసారి 2024లో రిపీట్ కావడం పెద్ద కష్టం కాదు అంటున్నారు విశ్లేషకులు.
ఇక పులివెందుల కొత్త ఇన్‌చార్జ్‌గా ఎమ్మెల్సీ బీటెక్ రవి పేరును బాబు ఖరారు చేసేశారు. ఎన్నికల వేళ చివరి వరకు అభ్యర్థిని ప్రకటించని బాబు.. ఈ సారి మాత్రం ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా పులివెందుల టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవిని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి తిరిగి పార్టీలోకి వచ్చినా కూడా రవియే 2024లో పోటీ చేస్తారని ఇప్పటికే చంద్రబాబు క్లారిటీ ఇవ్వడం శుభపరిణామం. ఇప్పటికే రవి ఓసారి వైఎస్ కుటుంబంపై విజయం సాధించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాపై గెలిచారు. బీటెక్ రవిపై టీడీపీ శ్రేణులకు భారీ అంచనాలు ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో బీటెక్ రవి.. జగన్ పై పోటీకి దిగుతున్నారు. ఫలితం ఎలా ఉన్నా.. గట్టి పోటీ మాత్రం తప్పదంటున్నారు విశ్లేషకులు. ఇక బీటెక్ రవి ఇలానే కష్టపడితే నియోజకవర్గంలో పార్టీ పునాదులు కూలిపోకుండా కాపాడుకోవచ్చు.. జగన్ మెజార్టీ తగ్గితే కడప ఎంపీ సీటు విషయంలో టీడీపీకి హెల్ఫ్ అవుతుంది అంటున్నారు విశ్లేషకులు.
ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండి తర్వాత వైసీపీ అడ్డా అయిపోయిన మరో నియోజకవర్గం జమ్మలమడుగు. ఇక్కడ రాజకీయాలు ఆదినారాయణ రెడ్డి వర్సెస్ రామసుబ్బారెడ్డిగా ఉండేవి. గత ఎన్నికలకు ముందు వీరు ఇద్దరు టీడీపీలో ఉన్నారు. ఆదినారాయణ కడప ఎంపీగా, రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇద్దరూ ఓడిపోయారు. తర్వాత ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి వెళ్లిపోతే.. రామసుబ్బారెడ్డి వైసీపీలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పోటీ ఖాయమైంది.
ఇది కూడా చదవండి : భీమ్లా నాయక్ కోసం చంద్రబాబు! సీఎం జగన్ కి సూటి ప్రశ్న!
అయితే ఇక్కడ ఆదినారాయణ రెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేష్ రెడ్డి టీడీపీలోకి రావడం.. బాబు వెంటనే భూపేష్‌రెడ్డికి ఇన్‌చార్జ్ పదవి ఇవ్వడంతో కేడర్ లో కొత్త జోష్ నిండింది. కడపలో ప్రొద్దుటూరు తర్వాత పార్టీకి జమ్మలమడుగులోనే బలమైన కేడర్ ఉంది. భూషేష్ రెడ్డి బలంగా ప్రయత్నిస్తే.. ఇక్కడ ఆయన విజయం సాధించడం అసాధ్యం కాదంటున్నారు విశ్లేషకులు. ఏదేమైనా చాలా రోజుల తర్వాత కడపలో పార్టీకి ఈ స్థాయిలో బలమైన ఆశాకిరణాలు కనిపిస్తుండడం గొప్ప విషయం అంటున్నారు. పార్టీ అధిష్టానం కూడా వీరికి బలమైన మద్దతు ఇస్తే 2024లో కడపలో వైసీపీకి విజయం అంత సులభం కాదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి కడపలో టీడీపీ భవిష్యత్తు ఎలా ఉండనుందో తెలియాలంటే.. మరి కొద్ది రోజులు ఎదురు చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.