ఏపీలో ముందస్తు ఎన్నికలు ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అధికార పార్టీతో పాటు విపక్షాలు కూడా అందుకు తగ్గట్లుగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా 2024 ఎన్నికలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు మరో రెండేళ్ల వ్యవధి ఉన్నప్పటికి.. ఇప్పటి నుంచే అందుకు సిద్ధం అయ్యేలా ప్రణాళికలు రచిస్తోన్నట్లు సమాచారం. ముందస్తు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనసేనాని రెండు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారట. దీని గురించి జనసేన ఆవిర్భావ దినోత్సవం అయిన మార్చి 14న కీలక ప్రకటన చేయనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంతకు ఆ ప్రకటనలు దేనిపై అనే అంశం గురించి రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
చేరికలు, పొత్తుల గురించి పవన్ కీలక ప్రకటన చేయబోతున్నారట. ఇతర పార్టీల నుంచి జనసేనలో చేరడానికి ఆసక్తిగా ఉన్నవారిని పార్టీలో చేర్చుకునేందుకు పవన్ కల్యాణ్ సిద్ధంగా ఉన్నారట. ముఖ్యంగా వైసీపీలో అసంతృప్తిగా ఉన్న ద్వితీయ శ్రేణి నేతలను జనసేనలో చేర్చుకునేందుకు సిద్దంగా ఉన్నారని.. ఈ చేరికలను స్వయంగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యవేక్షిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఇలా ఇతర పార్టీ నుంచి నేతలు జనసేనలో చేరడం పార్టీకి కలిసి వచ్చే అంశం అంటున్నారు విశ్లేషకులు.
ఇది కూడా చదవండి : ‘భీమ్లా’ నాయక్ పై నారా వారి ట్వీట్స్ కు కారణం?
ప్రధానంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వైసీపీ, టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు జనసేనలో చేరేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు సమాచారం. వారిలో కొందరు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ ను ఆశించే వారు కూడా ఉన్నారు. వీరి బ్యాక్ గ్రౌండ్, ఆర్థిక పరిస్థితిపై ఇప్పటికే జనసేన హైకమాండ్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. సదరు నేతకు ప్రజల్లో ఉన్న పలుకుబడితో పాటు, ఆయనకు ప్రజా సమస్యలపై ఉన్న అవగాహనను కూడా చేరికలలో ప్రాధాన్యత అంశంగా తీసుకోనున్నారట. పార్టీ పట్ల ఆ నేతలు ఎంత విశ్వాసంగా ఉంటారు అనే దాన్ని బట్టి.. వారిని ఆహ్వానించాలా వద్దా అని నిర్ణయం తీసుకోనున్నారట.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో.. ఒంటరి పోరా.. లేకా పొత్తులుంటాయా అనే దాని గురించి మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించబోయే సభలో పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతానికి ఏపీలో జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అయితే బీజేపీతో దోస్తి అంశం జనసేనకు కాస్త ఇబ్బందిగా మారింది. కాషాయ పార్టీతో చెలిమి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి మద్దతుగా ఉండాలి. కానీ తెలంగాణలో పవన్ కల్యాణ్.. టీఆర్‌ఎస్ కు సన్నిహితంగా ఉంటున్నారు. ఇక ఏపీలో బీజేపీతో చెలిమి ఉన్నప్పటికి.. గత ఎన్నికల్లో అది జనసేనకు పెద్దగా కలిసి రాలేదని కేడర్ భావిస్తోందట.
ఇది కూడా చదవండి : పవన్ విషయంలో మారిన కొడాలి నాని స్వరం! ఏకంగా సలహాలు!
ఈ క్రమంలో పవన్ కల్యాణ్.. టీడీపీతో పొత్తు గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జనసేనతో పొత్తుకు టీడీపీ ఆసక్తిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే టీడీపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ కు పెద్దగా ఆసక్తిలేకపోయినప్పటికి.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ని కట్టడి చేయాలంటే.. ప్రభుత్వంపై నెలకొన్న ప్రజా వ్యతిరేక ఓటును చీలి పోకుండా చూసుకోవాలి. అలా జరగాలంటే విపక్షాలు కలిసికట్టుగా ఉండాలి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ను ఓడించాలని బలంగా డిసైడయిన పవన్ కల్యాణ్.. అందుకోసం పొత్తులకు తలగ్గొనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీని గురించి స్పష్టత రావాలంటే.. మార్చి 14న జరగబోయే సభ కోసం ఎదురు చూడాలి. జనసేన ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కల్యాణ్ ఎలాంటి ప్రకటన చేయబోతున్నారనే దానిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయంది.