పవన్ కల్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా వారాహి యాత్ర ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది. రాజకీయం పక్కన పెడితే పవన్ కు సంబంధించి ఇప్పుడు సినిమా వార్త ఒకటి ట్రెండ్ అవుతోంది. అదేంటంటే ఇటీవల పవన్ కల్యాణ్ అన్ స్టాపబుల్ షూటింగ్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. దానికి సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఆ ఎపిసోడ్ స్ట్రీమింగ్ గురించి మాత్రం ఎలాంటి సమాచారం లేదు. ఆ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం చేస్తారంటూ పవన్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. దానిపైనే ఇప్పుడు అప్ డేట్ రానే వచ్చింది.
బాలకృష్ణ- పవన్ కల్యాణ్ ని ఒక స్క్రీన్ మీద చూడటం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అయితే ఈ అన్ స్టాపబుల్ షో వల్ల వెండితెరపై చూడలేని ఎన్నో అద్భుతమైన కాంబినేషన్స్ ని ఓటీటీలో చూపిస్తున్నారు. ఇటీవల వచ్చిన ప్రభాస్ ఎపిసోడ్ ని ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఎందుకంటే ఆ ఎపిసోడ్ విడుదల కాగానే ఆహా డొమైన్ డౌన్ అయిపోయింది. ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు పార్టులుగా విడుదల చేశారు. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ ఎపిసోడ్ విషయంలో కూడా అదే ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ ఎపిసోడ్ మొత్తాన్ని రెండు పార్టులుగా స్ట్రీమింగ్ చేయాలని చూస్తున్నట్లు చెబుతున్నారు.
ఒక్కో ఎపిసోడ్ దాదాపు 50 నిమిషాల వరకు ఉండచ్చని టాక్. అంతేకాకుండా దీని స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు నెట్టింట వార్తలు వస్తున్నాయి. తొలి పార్ట్ ని ఫిబ్రవరి 3న ప్రసారం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అదే నిజమైతే తర్వాతి వారంలో రెండో పార్టుని ప్రసారం చేసే అవకాశం ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ కోసం పవన్ అభిమానులు మాత్రమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ, రాజకీయ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? రాజకీయంగా, సినిమా, వ్యక్తిగత జీవితాలకు సంబంధించి పవన్ ఎలాంటి సమాధానాలు చెప్పారు? అనే ప్రశ్నలు చాలా రోజులుగా వస్తూనే ఉన్నాయి.
ఇప్పటికే విడుదల చేసిన అన్ స్టాపబుల్ ఫస్ట్ గ్లింప్స్ లో అసలు ఇంటర్వ్యూ ఎలా ఉండబోతోంది అనే విషయంపై ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఇంటర్వ్యూలో కచ్చితంగా పవన్ కల్యాణ్ రాజకీయ, సినిమా, వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన చాలా ప్రశ్నలు, బయట వచ్చే చాలా విమర్శలపై పవన్ స్పందించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కాస్త ఫన్నీగా కూడా సాగినట్లు కనిపించింది. నన్ను బాల అని పిలవని బాలయ్య కోరగా.. ఓడిపోవడానికి కూడా సిద్ధం కానీ మిమ్మల్న అలా పిలవలేను అంటూ పవన్ కల్యాణ్ చెప్పడం చూశాం. ఈ అప్డేట్ తో పవన్ అభిమానులు నెట్టింట సంబరాలు చేసుకుంటున్నారు.