భారీ అంచనాలతో వచ్చిన స్పై సినిమా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేదు. దీంతో సినిమా విడుదలైన నెల కాకముందే ఓటీటీలోకి వచ్చేసింది. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే?
టాలీవుడ్ లో వైవిధ్యమైన కథలతో అలరిస్తున్న నిఖిల్ సిద్దార్థ్ కార్తికేయ 2తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. మొదట్లో వరుస ప్లాప్స్ తో సతమతమైన ఈ చిన్న హీరో.. స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య వంటి విభిన్నమైన కథలతో ఆకట్టుకుంటూ ఇవాళ పాన్ ఇండియా హీరో స్థాయికి ఎదిగారు. కార్తికేయ 2 సినిమా ఊహించని విజయాన్ని అందుకోవడంతో నిఖిల్.. పాన్ ఇండియా సినిమాలతో బిజీ అయిపోయారు. ది ఇండియన్ హౌస్, స్వయంభు వంటి డిఫరెంట్ కంటెంట్ తో మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక రీసెంట్ గా నిఖిల్ నటించిన స్పై సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన స్పై జూన్ 29న విడుదలైంది. స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారని చెప్పడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్, చూసిన తర్వాత హైప్ మరింత పెరిగింది. స్పైలో గూఢచారి పాత్రకు న్యాయం చేశాడని చెప్పవచ్చు. కానీ కథ, కథనం ఆకట్టుకోకపోవడంతో శ్రమ మొత్తం వృథా అయిపోయింది. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో నెలరోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది.
ఎలాంటి అనౌన్స్ చేయకుండా ఓటీటీలోకి అప్పుడే రావడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో బుధవారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. కనీసం ప్రకటన కూడా ఇవ్వకపోవడం పట్ల ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్పై సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది. మరి ఓటీటీలో అయినా ఈ సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి.