తెలుగు ప్రేక్షకులను ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, సెలబ్రిటీ టాక్ షోలు, వెబ్ సిరీస్ లతో అలరిస్తున్న ప్రముఖ ఓటిటి ‘ఆహా‘. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టేందుకు సిద్ధమైంది. ఎలాగో సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు టీవీ ఛానల్స్ లో సీరియల్స్ చూసే ప్రేక్షకులు ఎక్కువగా ఉంటారు కదా.. వారిని దృష్టిలో పెట్టుకొని ఆహా వారు డైలీ సీరియల్ లాగా డైలీ సిరీస్ ని ప్రారంభించారు. ‘మిష్టర్ పెళ్లాం’ అనే పేరుతో నవంబర్ 28న ఈ డైలీ సిరీస్ మొదలవ్వగా.. సోమవారం నుండి గురువారం వరకు మధ్యాహ్నం 2 గంటలకు ఆహాలో ప్రసారమవుతుంది. అన్ని ఎపిసోడ్లను ఆహాలో ఉచితంగా చూడవచ్చని తెలిపారు నిర్వాహకులు.
ఇప్పటి వరకూ ఆహా నుంచి వచ్చిన ఒరిజినల్స్, రియాలిటీ షోస్, వెబ్ సిరీస్ ఇలా అన్నీ మంచి అనుభూతినే అందించాయని, ఈసారి సరిహద్దులను విస్తరించాలని అనుకుంటున్నట్టు ఆహా సీఈఓ అజిత్ ఠాకూర్ తెలిపారు. డైలీ సీరియల్స్ ను ఇష్టపడి ఆదరించే మహిళల కోసమే మిష్టర్ పెళ్లాం డైలీ సిరీస్ ను సిద్ధం చేశామని అన్నారు. ఈ సీరియల్ లో అమర్ దీప్ చౌదరీ, పూజా మూర్తి, సోనియా నటించారు. భవ్య (పూజా మూర్తి), నివాస్ (అమర్ దీప్), రేఖ (సోనియా) అనే ముగ్గురు వ్యక్తుల మధ్య నడిచే కథ ఈ మిష్టర్ పెళ్లాం. పెళ్లి కోసం, తనను తనలానే ప్రేమించే భర్త కోసం భవ్య కలలు కంటూ ఉంటుంది.
ఇక నివాస్.. ఒక డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలని కలలు కంటూ ఉంటాడు. భవ్య దగ్గర పని చేసే రేఖ తనని అమితంగా ప్రేమించే వ్యక్తి తన జీవితంలోకి రావాలని కోరుకుంటుంది. మరి ఈ ముగ్గురి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి? వీరు కల కన్నట్టు కోరుకున్న వ్యక్తులతో పెళ్లి అవుతుందా? వీరి ప్రయాణం ఎలా సాగుతుంది? తెలుసుకోవాలనుకుంటే ఆహాలో మిష్టర్ పెళ్లాం డైలీ సిరీస్ చూసేయాల్సిందే. ఫుల్ కామెడీ, డ్రామాతో అలరించేందుకు సిద్ధమైంది.