బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ అంటే.. మాస్ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ కమెడియన్ నుండి సినీ హీరోగా ఎదిగిన సుధీర్.. ఇప్పుడు తన సినీ కెరీర్ పై పూర్తిగా దృష్టి పెట్టాడు. అందుకే కొంతకాలంగా అటు టీవీ షోలకు దూరంగా ఉంటూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. మొదట సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేసినా.. 2019లో ‘సాఫ్టువేర్ సుధీర్’ అనే మూవీతో హీరోగా మారాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అనిపించుకోగా.. ఇటీవల హీరోగా ‘గాలోడు’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సుధీర్ కి ఉన్న క్రేజ్ కారణంగా గాలోడు మంచి హిట్ అయ్యిందని సినీవర్గాలు చెబుతున్నాయి.
ఇక మినిమమ్ అంచనాలతో విడుదలైన గాలోడు సినిమా.. నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేయడం విశేషం. సుధీర్ తో ‘సాఫ్టువేర్ సుధీర్’ మూవీ తీసిన దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచెర్లనే.. గాలోడు మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమాలో సుధీర్ సరసన గెహెనా సిప్పి హీరోయిన్ గా నటించింది. అయితే.. రెగ్యులర్ స్టోరీ అయినప్పటకీ.. మాస్ యాక్షన్ ఎలిమెంట్స్, సుధీర్ క్యారెక్టర్ బాగున్నాయని ప్రేక్షకులు అంటున్నారు. దీంతో సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో.. గాలోడు మూవీ మొదటి రోజు నుండే కలెక్షన్స్ బాగా రాబట్టింది. రూ. 2.85 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో గాలోడు రిలీజ్ అయ్యింది.
దీంతో విడుదలైన నాలుగో రోజు రూ. 3 కోట్ల షేర్ రాబట్టి.. ప్రాఫిట్ బాటలో చేరింది. ప్రస్తుతం గాలోడు మూవీ మాస్ ఆడియెన్స్ ని మెప్పిస్తూ.. కలెక్షన్స్ పరంగా నిర్మాతలను లాభాల బాటలో చేర్చిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అంతేగాక సుధీర్ కెరీర్ ఫస్ట్ సూపర్ హిట్ గా గాలోడు నిలిచింది. కాగా.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించి ప్రముఖ ఓటిటి సంస్థ భారీ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. సుధీర్ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని డిస్నీ హాట్ స్టార్.. మొత్తం రూ. 5 కోట్లకు శాటిలైట్, ఓటిటి హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే.. గాలోడు ప్రస్తుతం థియేటర్స్ లో విజయవంతంగా రన్ అవుతోంది.