అరుళ్ శరవణన్.. దేశవ్యాప్తంగా ఈ పేరు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఐదు పదుల వయుసు దాటిన తర్వాత హీరో కావాలి అనే తన కలను నెరవేర్చుకున్నాడు. లెజెండ్ శరవణన్ స్టోర్స్ ని ప్రారంభించి ఒక వ్యాపార వేత్తగా తనని తాను నిరూపించుకున్నారు. అయితే నటుడు కావాలనే కల మాత్రం అలాగే ఉండిపోయింది. తన స్టోర్‌కి సంబంధించిన ఎన్నో యాడ్స్ లో నటించినప్పటికీ హీరోగా చేయలేకపోయానే అనే వెలితి అలాగే ఉండిపోయింది. అందుకే దానిని పూర్తి చేసుకునేందుకు సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేసి సినిమా తెరకెక్కించారు. ఎంతో గొప్ప కాస్టింగ్‌తో రూ.80 కోట్ల బడ్జెట్‌తో ‘ది లెజెండ్’ అనే సినిమా తీశారు. సినిమా ఫలితాన్ని పక్కన పెడితే శరవణన్ కల మాత్రం నెరవేరింది.
అయితే సినిమా వల్ల అరుళ్ శరవణన్ కోల్పోయింది కూడా ఏం లేదనే చెబుతున్నారు. ఎందుకంటే తన స్టోర్‌కి దేశవ్యాప్తంగా పబ్లిసిటీ దక్కిందని చెప్పుకొచ్చారు. అలా చూసుకుంటే శరవణన్‌కు లాభమే వచ్చిందని చెప్పుకున్నారు. త్వరలోనే మరో సినిమాని కూడా శరవణన్ తెరకెక్కించబోతున్నారనే టాక్ కూడా వచ్చింది. తొలి సినిమాని రూ.80 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.. మరి రెండో సినిమాని ఎంత బడ్జెట్‌తో తెరకెక్కిస్తారు? ఎవరిని హీరోయిన్‌గా తీసుకుంటారు? ఈసారి కాస్ట్ ఎవరు ఉంటారనే ప్రశ్నలు కూడా బాగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ది లెజెండ్ సినిమా గురించి ఒక షాకింగ్ వార్త బయటకు వచ్చింది. షాకింగ్ అని ఎందుకు అంటున్నాం అంటే అరుళ్ శరవణన్ తీసుకున్న నిర్ణయం అటు షాకింగ్‌గా, ఇటు ఆశ్చర్యంగా ఉంది కాబట్టి.
విషయం ఏంటంటే.. ది లెజెండ్ శరవణన్ సినిమాని థియేటర్లలో చాలా మంది చూడలేదు. చాలామందికి ఆ సినిమాని థియేటర్లో చూసే ఇంట్రస్ట్ రాలేదని చెప్పారు. అయితే ఓటీటీ రిలీజ్ కోసం మాత్రం ఎదురుచూశారు. ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతుందా అని చూస్తూ ఉన్నారు. అయితే అలాంటి వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ది లెజెండ్ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే అవకాశం లేదనే చెబుతున్నారు. ఎందుకంటే అరుళ్ శరవణన్ సినిమాకి ఓటీటీ రిలీజ్ చేయరంట. సినిమా విడుదలకు ముందు, తర్వాత కూడా ఓటీటీ ఆఫర్లు వస్తున్నా కూడా ఇచ్చేందుకు ఆయన ఇంట్రస్ట్ చూపించడం లేదంట. నా సినిమా ఒక క్లాసిక్.. దానిని అంత ఈజీగా అందుబాటులో ఉంచడం నాకు ఇష్టం లేదంటూ కామెంట్ చేశారంట. అయితే ది లెజెండ్‌ని క్లాసిక్ అని చేసిన కామెంట్స్ ని పక్కన పెడితే.. ఓటీటీలో లేదనే విషయంలో మాత్రం కొందరు నిరాశ చెందుతున్నారు.