టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 27వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గంలో పాదయాత్ర సాగుతోంది. జనం పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొంటున్నారు.
నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర 27వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని తిరుపతి నియోజకవర్గంలో లోకేష్ యాత్ర కొనసాగుతోంది. ప్రజలు పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొంటున్నారు. యువనేతతో పాటు కలిసి నడుస్తూ తమ మద్దతు తెలియజేస్తున్నారు. శనివారం 27వ రోజు పాదయాత్ర తిరుపతి అంకుర హాస్పిటల్ సమీపంలో ఉన్న విడిది కేంద్రంనుంచి ప్రారంభం అయింది. పాదయాత్ర ప్రారంభానికి ముందు లోకేష్ 1000 మందితో సెల్ఫీలు దిగారు. అనంతరం రిటైర్డ్ ప్రభుత్వోద్యోగులతో లోకేస భేటీ అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. ఆ తర్వాత భవన నిర్మాణకార్మికులతో సమావేశం అయ్యారు. వారి సమస్యలపై ఆరా తీశారు.
కచ్చితంగా సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ‘‘ వైఎస్ జగన్ పాలనలో ఎక్కువ ఇబ్బంది పడింది భవన నిర్మాణ కార్మికులే. జగన్ పాలనలో బంగారం దొరుకుతుంది ఏమో కానీ ఇసుక దొరకదు. అద్భుతమైన ఇసుక విధానం తీసుకొస్తా అని 60 మంది భవన నిర్మాణ కార్మికులను చంపేశాడు. ఎంతో మంది జీవితాలతో ఆడుకుంటూ జగన్ ఇసుక దందా చేస్తున్నారు. రోజుకి ఇసుక అక్రమ రవాణా ద్వారా 3 కోట్లు సంపాదిస్తున్నారు. ఏడాదికి వెయ్యి కోట్లు కొట్టేస్తున్నారు. ఐదేళ్లలో జగన్ ఇసుక ద్వారా 5 వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఏపీ ఇసుక ఏపీలో దొరకదు.. ఇతర రాష్ట్రాల్లో దొరుకుతుంది. టీడీపీ హయాంలో వెయ్యి రూపాయిలు ఉన్న ట్రాక్టర్ ఇసుక జగన్ పాలనలో 5 వేలకు చేరింది. సిమెంట్ ధరలు జగన్ పాలనలో 60 శాతం పెరిగాయి.
ప్రతి సిమెంట్ బస్తాకి జగన్ కి వాటా వెళ్తుంది. భవన నిర్మాణ కార్మికుల సొమ్ము జగన్ దొబ్బేశాడు. సంక్షేమ బోర్డు ద్వారా సేకరించిన సెస్ నిధులు కూడా జగన్ ప్రభుత్వం సుమారుగా వెయ్యి కోట్లు పక్కదారి పట్టించారు. కార్మికుల ఆడపిల్లలకు పెళ్లయితే ఒక్కొక్కరికి రూ.20 వేలు చొప్పున బోర్డు అందించే పెళ్లి కానుక రద్దు చేశారు. ప్రసవించిన కార్మికుని భార్య లేక కూతుర్లకు కాన్పుకు రూ.20 వేల చొప్పున చేసే సాయం రద్దు చేశారు. కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద భీమా రద్దు చేశారు’’ అని అన్నారు. అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో పాదయాత్ర ప్రారంభమైంది.