సినిమా టికెట్ల వ్యవహారంపై ఏపీలో దుమారం రేగుతూనే ఉంది. ఇక శ్యామ్ సింగరాయ్ సినిమా విడుదలకు ముందు హీరో నాని చేసిన కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. ఏపీలో సినిమా టికెట్ల రేట్లను ప్రభుత్వం భారీగా తగ్గించడంతో.. కిరాణా షాపుల కన్నా థియేటర్లకు తక్కువగా ఆదాయం వస్తుందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికీ దుమారం రేగుతోంది.
నాని వ్యాఖ్యలపై తాజాగా సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. సినిమా థియేటర్ల కంటే కిరాణ కొట్టు వ్యాపారం బాగున్నప్పుడు.. ఆయన సినిమాలు చేయడం వేస్ట్ అని, కిరాణా దుకాణమే పెట్టుకోవచ్చు కదా.. అని రోజా సెటైర్లు వేశారు. నాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రెచ్చగొట్టడమే అవుతుందని రోజా విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల సినిమా పరిశ్రమ మరింత నష్టపోయే అవకాశముందన్నారు. అందుకే అందరూ జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. సీఎం జగన్ ఏం చేసినా పేదలకు మంచి జరిగేలానే చూస్తారని రోజా తెలిపారు. అందరూ పెద్ద సినిమాల గురించి ఆలోచిస్తున్నారే తప్ప చిన్న సినిమాల గురించి ఆలోచించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం నిర్ణయించిన కమిటీ అన్ని విషయాలను పరిష్కరిస్తుందని ఆమె స్పష్టం చేశారు.
కొద్దిమంది రాజకీయ ఉనికిని చాటుకునేందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని.. వారి వల్లే ఇలాంటి వివాదాలు వస్తున్నాయని పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి రోజా వ్యాఖ్యానించారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరికి తోచినట్టు వారు మాట్లాడటం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని రోజా విమర్శించారు. మంచి ఉదేశ్యంతో చర్చలకు వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఆమె స్పష్టం చేశారు. రోజా వ్యాఖ్యలతో టాలీవుడ్‌లో ఈ వివాదం మరింత ముదురుతోంది.