హైదరాబాద్- ఈ మధ్య కాలంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. అందులోను సైబర్ నేరాలకు అంతే లేకుండా పోతోంది. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న సైబర్ ముఠాలు, అమాయకులను టార్గెట్ చేస్తూ అందినంతా దోచుకుంటున్నారు. సైబర్ నేరాల్లో పోలీసులు సైతం ఏంచేయలేకపోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో మరో సైబర్ నేరం వెలుగు చూసింది.
హైదరాబాద్ నగర శివారు ఘటకేసర్ కు చెందిన ఓ వ్యక్తి ఇలాగే ఒకే సమయంలో రెండు సార్లు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి ఏకంగా 16.72 లక్షల రూపాయలు మోసపోయాడు. 33 ఏళ్ల ఓ వ్యక్తి ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. గత సంవత్సరం అక్టోబరులో ఓ మహిళ నుంచి ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే అంగీకరించాడు. ఆ తరువాత ఇద్దరి మధ్య పరిచయం పెరిగి, ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ గా మారారు. ఫేస్ బుక్ నుంచి వాట్సాప్ ఛాటింగ్ చేసుకునే వరకు వచ్చింది. ఓ రోజు వాట్సాప్ లో వీడియో కాల్ లో ఇద్దరూ దుస్తులు లేకుండా మాట్లాడుకున్నారు.
ఆ తర్వాత కాసేపటికి ఇలా నగ్నంగా వాళ్లు మాట్లాడుకున్న ఆ వీడియో బాధితుడి వాట్సాప్ కు వచ్చింది. అది చూసి అతను ఖంగు తిన్నాడు. డబ్బులివ్వకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని ఆ మహిళ బెదిరించడంతో అతడు 1.4 లక్షలు ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ చేశాడు. మరుసటి రోజు మళ్లీ డబ్బులు కావాలని వేధిస్తుండటంతో ఫేస్ బుక్ ఖాతాను డిలీట్ చేసి, ఆ ఫోన్ నంబర్‌ను స్విచ్ఛాఫ్ చేశాడు.
చాలా కాలం అయ్యింంది కదా అని ఈ మధ్య కాలంలో మళ్లీ తన పాత ఫోన్ నంబర్‌ను ఆన్ చేయగా.. సైబర్ నేరగాళ్ల ఆ పాత వీడియోను మళ్లీ పంపించి బెదిరించారు. దీంతో మరో 8లక్షలు పంపించాడు. అయినప్పటికీ ఇంకా డబ్బులు పంపించాలని వారు బ్లాక్ మెయిల్ చేయడంతో పైసాబజార్.కామ్ లో 11 లక్షలకు పర్సనల్ లోన్ కోసం అప్లై చేశాడు. కాసేపటికే ముత్తూట్ ఫైనాన్స్ నుంచి అంటూ ఓ మహిళ కాల్ చేసి మాట్లాడింది. నామినీ, ప్రాసెసింగ్ ఛార్జీలు, బీమా, ఐటీ రిటర్న్స్, జీఎస్టీ ఛార్జీలు ఇతరత్రా పేరిట ఏకంగా 7.32 లక్షలు చెల్లించాడు.
నాలుగైదు రోజుల్లో లోన్ అమౌంట్ మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుందని ఆమె చెప్పడంతో నమ్మేశాడు. కానీ ఎంతకీ అకౌంట్ లోకి డబ్బులు రాకపోవడంతో ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయానికి వెళ్లి ఆరా తీశాడు. అదంతా ఫేక్ అని తెలయడంతో తాను మోసపోయానని గ్రహించి, పోలీసులకు పిర్యాదు చేశాడు.