కరీంగనర్ క్రైం– ఈ కాలంలో కొంత మంది యువత చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. చిన్ని చిన్న విషయాలకే మనస్థాపానికి గురవుతున్నారు. పరీక్షల్లో ఫేయిల్ అయినా, ప్రేమ విఫలం అయినా, ఇంట్లో తల్లి దండ్రులు మందలించారని.. ఇలా చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కానీ ఇలా అర్ధాంతరంగా తనువు చాలిస్తే కన్నవాళ్లకు ఎంత నరకయాతన ఉంటుందో మాత్రం వాళ్లు ఆలోచించడం లేదు.
తాజాగా దసరా పండక్కి బటట్లు కొనుక్కునేందుకు డబ్బులు ఇవ్వలేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారంలో దసరా పండక్కి కొత్త బట్టలు కొనుక్కోవడానికి తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదన్న మనస్తాపంతో డిగ్రీ విద్యార్థిని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కూనారం గ్రామానికి చెందిన అరెల్లి తిరుపతి, లలిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
చిన్న కూతురు 18 ఏళ్ల అఖిల డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో కొత్త బట్టలు కొనుక్కోవడానికి 2 వేల రూపాయలు కావాలంటూ నాలుగు రోజులుగా అఖిల తండ్రిని అడుగుతోంది. ఐతే ప్రస్తుతం తన దగ్గర డబ్బులు లేవని, తర్వాత ఇస్తానని ఆయన సర్దిచెబుతూ వస్తున్నారు. ఆదివారం ఉదయం చివరిసారిగా తండ్రిని డబ్బులు అడగ్గా, ఆయన మళ్లీ అదే సమాధానం చెప్పారు. దీంతో అఖిల మనస్తాపానికి గురైంది.
తండ్రి కౌలుకు చేస్తున్న వ్యవాయ పొలం దగ్గరకు సైకిల్‌పై వెళ్లి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. చెతికి అందివచ్చిన కూతురు అఖిల మృతితో తల్లి దండ్రుల శోకం వర్ణనాతీరం. వాళ్లు రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. మృతురాలు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు కాల్వశ్రీరాంపూర్ పోలీసులు తెలిపారు. అఖిల మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.