అనంతపురం- ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి. చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండగా, మరి కొంత మంది అంగవైకల్యం పొందుతున్నారు. అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇలా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలు చాలా వరకు రోడ్డున పడుతున్నాయి.
అనంతపురంలో జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. మరో ఐదు రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన కదిరి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఎరుకలవాండ్లపల్లి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ యువకుడు చనిపోయాడు.
ఎర్రదొడ్డికి చెందిన మహేష్ ఉపాధి కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లి, నెల రోజుల కిందటే పెళ్లి కోసం సొంత ఊరికి వచ్చాడు. ఈ నెల 27న కదిరిలో మహేష్ వివాహానికి జరగాల్సి ఉంది. వివాహ ఆహ్వాన పత్రికలను బంధువులకు ఇచ్చేందుకు స్వగ్రామం నుంచి అర్ధరాత్రి బయలుదేరిన కొంత సమయానికే మహేశ్ ప్రమాదానికి గురయ్యాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మహేష్ అక్కడికక్కడే చనిపోయాడు.
దీంతో మహేష్ కుటుంబ సభ్యులతో పాటు, పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. పెళ్లి చేసుకుని కొత్త కోడలితో కలిసి జంటగా ఇంటికి వస్తాడనుకున్న కొడుకు ఇలా శవమై వస్తాడనుకోలేదని కన్నీరుమున్నీరయ్యారు. మహేష్ మరణంతో ఆ గ్రామంలో విషఆద ఛాయలు అలముకున్నాయి. ఇక రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.