స్మార్ట్ ఫోన్ వచ్చాక సెల్ఫీల పిచ్చి పెరిగిపోయింది. కూర్చున్నా సెల్ఫీ.. నిల్చున్నా సెల్ఫీ తింటున్నా సెల్ఫీ. ఏం చేసినా సెల్ఫీనే. కానీ., ఒక్కోసారి సెల్ఫీ పిచ్చి ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. అనేక కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇంత జరుగుతున్నా మార్పు రావడం లేదు. తాజాగా సెల్ఫీ మోజు యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో మూతబడిన విద్యా సంస్థలు ఇప్పుడప్పుడే తెరుచుకునే పరిస్థితి కనిపించడంలేదు.
దీంతో ఇళ్లలో ఖాళీగా ఉంటున్న యువతీ యువకులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. తమిళనాడులోని తిరుపతుర్ జిల్లా వనియంబడి ప్రాంతం చిన్నమొత్తుర్ గ్రామానికి చెందిన కె.సంజీవ్ అనే 20 ఏళ్ల యువకుడు తన ఇంటికి సమీపంలో ఉన్న పొలం వద్ద ట్రాక్టర్ పై ఉండి సెల్ఫీలు తీసుకుని తన స్నేహితులకు పంపించాడు. వారు ఆ సెల్ఫీలు బాగున్నాయని చెప్పడంతో అతను ట్రాక్టర్‌ను స్టార్ట్ చేసి దాన్ని వెనక్కి నడిపిస్తూ సెల్ఫీలు తీసుకోవడం ప్రారంభించాడు.
అయితే ట్రాక్టర్ అదుపు తప్పి వేగంగా వెనక్కి వెళ్లి అక్కడికి సమీపంలో ఉన్న ఓ వ్యవసాయ బావిలో పడిపోయింది. ప్రమాదాన్ని గమనించిన చుట్టుపక్కల రైతులు వెంటనే పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది సంజీవ్ న రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే అతను మృతి చెందాడు.
దీంతో బావి నుంచి వారు నీటినంతా తోడేశారు. ఆ బావి 120 అడుగుల లోతు ఉండగా అందులో 35 అడుగుల మేర నీరుంది. దీంతో మోటార్ల సహాయంతో నీటిని తోడి సంజీవ్ మృతదేహాన్ని వెలికి తీశారు. కాగా సంజీవ్ కేటరింగ్ కోర్సును పూర్తి చేసి ఓ సంస్థలో ఇటీవలే ఉద్యోగంలో చేరాడు. అతను అకస్మాత్తుగా చనిపోవడంతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.