ఫిల్మ్ డెస్క్- విజయేంద్ర ప్రసాద్.. ఆయన కేవలం ప్రముఖ సినీ దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి తండ్రిగానే తెలుసు. అంతే కాకుండా రాజమౌళి సినిమాలకు కధ అందిస్తారని అనుకుంటారు చాలా మంది. కానీ రాజమౌళి సినిమాల్లోకి రాకముందు నుంచే విజయేంద్ర ప్రసాద్ ప్రసిద్ధిచెందిన తెలుగు సినీ రచయిత. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న విజయేంద్ర ప్రసాద్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన పూర్తి పేరు కోడూరి వెంకట విజయేంద్ర ప్రసాద్. 35 ఏళ్ల క్రితమే సినీ రంగంలోకి ప్రవేశించారు. 1988 లో అక్కినేని నాగార్జున, విజయశాంతి నటించిన జానకిరాముడు సినిమాకు కధ అందించారు విజయేంద్రప్రసాద్. అప్పటి నుంచి చాలా సినిమాలకు కధ అందించడంతో పాటు, పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. బాల కృష్ణ హీరోగా 1994లో వచ్చిన బొబ్బిలి సింహం సినిమాకు కధ అందించారు విజయేంద్రప్రసాద్.
ఘరానా బుల్లోడు, సమరసింహా రెడ్డి, సింహాద్రి, సై, విజయేంద్ర వర్మ, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మిత్రుడు, రాజన్న, మగధీర, బాహుబలి వంటి సినిమాలకు విజయేంద్ర ప్రసాద్ కధ అందించారు. 1996లో వచ్చిన అర్ధాంగి సినిమాతో పాటు ఆ తరువాత శ్రీకృష్ణ, రాజన్న, శ్రీవల్లి సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. బాలీవుడ్ క్విన్ కంగనా రనౌత్ నటించి బ్లాక్ బాస్టర్ మూవీ మణికర్ణిక సినిమాకు సైతం ఆయన కధ అందించారు. ఆ మధ్య బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ నటించిన భజరంగీ భాయిజాన్ కు కధ అందించింది విజయేంద్ర ప్రసాదే. ఇలా పలు తమిళ సినిమాలకు సైతం కధలను అందించారు.
ప్రస్తుతం ఎన్టీఆర్, రాంచరణ్ లు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సైతం విజయేంద్ర ప్రసాదే కధ అందించారు. ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ సినిమాకు కధ ఈయనదే. అంతే కాదు పాన్ ఇండియా సినిమాగా వస్తున్న బాలీవుడ్ మూవీ సీత కు కూడా విజయేంద్ర ప్రసాద్ కధ అందిస్తున్నారు. ఇంత వరకు చూడని సరకొత్త కోణంలో ఈ రామాయణాన్ని తెరకెక్కించనున్నారు.
ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఉన్న సీతను కాకుండా సరికొత్త విధంగా సీత క్యారెక్టర్‌ను చూపించాలని విజయేంద్రప్రసాద్ భావిస్తున్నారట. సీత పాత్రలో కరీనా కపూర్ లేదా ఆలియా భట్ లలో ఒకరిని తీసుకుంటారని సమాచారం. అలాగే రావణుడి పాత్రలో రణ్ వీర్ సింగ్ అయితే బాగుంటుందని టీం ఆలోచిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక విజయేంద్ర ప్రసాద్ కధ అందించిన బాహూబలి సినిమా ప్రపంచం వ్యాప్తంగా ఎంత భారీ హిట్ అయ్యిందో వేరే చెప్పక్కర్లేదు. ఇటీవలే కరోనా సోకడంతో హోం క్వారంటైన్ లో ఉండి కోలుకున్నారు. ఇక ఈ రోజు విజయంద్ర ప్రసాద్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆయనకు సుమన్ టీవీ తరపున హ్యాపీ బర్త్ డే.