ప్రకృతి నుంచి వచ్చే ఒక అద్భుతమైన ఔషధం తేనె అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.తేనె తీయగా ఉండడంతోపాటు, తేనెను చాలా మంది వంటకాల్లో, ఆయుర్వేదంలో కూడా బాగా వినియోగిస్తూ ఉంటారు. తేనెను రోజుకో స్పూను తాగితే, ఎన్నో లాభాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ఎన్నో ఔషధాల్లో వినియోగిస్తున్న తేనెను రోజూ స్వీకరిస్తే క్యాన్సర్‌తో పాటు, గుండె జబ్బుల ప్రమాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. తేనెను ఆహారంగా తీసుకోవడం ద్వారా అథ్లెట్లలో సామర్థ్యం మరింతగా పెరుగుతుందట. అంతేకాదు, అల్సర్ తదితర గ్యాస్ సంబంధిత రోగాలను తగ్గిస్తాయట. తేనెటీగలు తాము సేకరించిన తేనెపై హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను తయారు చేసే ఎంజైమును కలుపుతాయి కాబట్టి తేనె యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేస్తుంది. సాధారణంగా తేనె ధర 400 -1000 ఉండడం మనం చూస్తూనే ఉంటాము.కానీ టర్కీకి చెందిన ఒక కంపెనీ తయారు చేసే తేనె ధర మాత్రం ఏకంగా కేజీ 8.8 లక్షల రూపాయలు. వాస్తవానికి ఈ తేనెకు ఎందుకు అంత ధర దాని ప్రత్యేకతలు? టర్కీకి చెందిన సెంటారీ హనీ అనే కంపెనీ ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన తేను ఉత్పత్తి చేస్తున్న కంపెనీగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.
ఈ కంపెనీ తయారు చేసిన తేనెను పట్టణాలకు జనావాసాలకు చాలా దూరంగా, సముద్రమట్టానికి 2500 అడుగుల ఎత్తులో ఉండే గుహల నుంచి సేకరించడంతో పాటు, కొన్ని సార్లు ఇతర దేశాలలోని అడవుల్లోకి వెళ్లి అక్కడ గుహలలో తేనె కోసం అన్వేషణ కూడా చేస్తారని, సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఈ తేనే లభ్యమవుతుందని కంపెనీ తెలియజేస్తున్నారు. ఈ తేనె సాధారణ తేనెలా ఉండదు. డార్క్ కలర్‌లో ఉంటుంది. రుచి కూడా భిన్నంగా ఉంటుంది. సాధారణ తేనెలు తియ్యంగా ఉంటే…ఇది కాస్త చేదుగా అనిపిస్తుంది. ఐతే ఇందులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే ధర ఎక్కువైనా టర్కీ లాంటి దేశాల్లో చాలా మంది ఈ తేనెను కొనేందుకు ఎగబడతారు.