దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. మరోవైపు కేసుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియలో పొరపాట్లు జరుగుతున్నాయి. మొదటి డోస్, రెండవ డోస్ టీకా మార్చి వేయడం., వ్యాక్సిన్ ఫీల్ చేయకుండానే ఖాళీ సిరంజి ఇంజెక్ట్ చేయడం, ఒక సారి రెండు డోస్ లు ఇవ్వడం వంటి పొరపాట్లు తరచుగా జరుగుతున్నాయి. ఇప్పుడు జరిగిన తప్పిదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మహా రాష్ట్రలోని థానేలో ఓ మహిళకు అధికారులు ఒకేసారి మూడు డోసుల కరోనా వ్యాక్సిన్ వేశారు. ఆనంద్ నగర్ లోని టీకా కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యంతో 28 ఏళ్ల మహిళకు నిమిషాల వ్యవధిలో మూడు డోసుల టీకాలు వేశారు. థానే మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే తన భర్తకు ఆమె జరిగిందంతా చెప్పడంతో అతడు స్థానిక కార్పొరేటర్ కు విషయాన్ని వివరించాడు. ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ అధికారులే ఆమెను పర్యవేక్షణలో ఉంచారు.
తన భార్యకు వ్యాక్సినేషన్ విధానం గురించి తెలియదని ఆమె భర్త చెప్పాడు. వెంటవెంటనే మూడు డోసుల తీసుకోవడం వల్ల ఆ రోజు ఆమెకు బాగా జ్వరం వచ్చిందని, మర్నాడే తగ్గిపోయిందని వివరించాడు. ప్రస్తుతం ఆమె బాగానే ఉందన్నాడు. విషయం తెలిసిన వెంటనే బాధితురాలిని అబ్జర్వేషన్ లో పెట్టామని, ఆమె ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉందని టీఎంసీ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఖుష్బూ తావ్డే చెప్పారు. ఘటనపై దర్యాప్తు కోసం కమిటీని వేశామన్నారు. కారకులపై చర్యలు తీసుకుంటామని మేయర్ నరేశ్ మెహస్కే హామీ ఇచ్చారు.