కేరళ క్రైం- అన్నయ్యా.. నన్ను భర్తతో పాటు అత్తా మామలు బాగా కొడుతున్నారు.. వెంటనే వచ్చి నన్ను తీసుకెళ్లిపో.. లేదంటే నేను తెల్లారేసరికి బతికుంటానో లేదో.. ఓ అభాగ్యురాలు తన అన్నకు ఫోన్ చేసి చెప్పిన మాటలివి. ఆ ఏముందిలే రోజూ ఉండే తతంగమే కదా, ఉదయానికి సర్ధుకుంటుంటుందిలే అని అనుకుని లైట్ గా తీసుకున్నాడా అన్న. అంతే ఇంకేముంది.. ఆ చెల్లి ఫోన్ చేసిన వారం రోజులకే ఓ కబురు వినాల్సి వచ్చింది.
కేరళలోని పయ్యనూర్‌కు చెందిన విజీష్‌కు బాధితురాలు సునీషతో సరిగ్గా సంవత్సరం క్రితం పెళ్లైంది. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లేం కాదు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం అయిన కొన్ని రోజుల నుంచే భర్త, అత్త మామల నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఈ విషయం గురించి పుట్టింటి వారికి చెప్పి తన బాధను పంచుకుంది సునీష.
తన భర్త తనను ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడని,. అత్తగారు తన జుట్టుపట్టుకుని లాగేదని, ఒకానొక సమయంలో మామగారు తనను హెల్మెట్ తీసుకుని కొట్టారని అమ్మా నాన్నలకు చెప్పుకుని ఏడ్చింది చాలా సార్లు. ఈ విషయం పుట్టింటి వారికి చెప్పిందని సెల్ ఫోన్ కూడా లాగేసుకున్నారట. అంతే కాదు నెల రోజులుగా ఆమెకు కడుపు నిండా తిండి కూడా పెట్టకుండా అమానుషంగా ప్రవర్తించారు.
ఇక ఆమెను తమ ఇంటికి తీసుకొచ్చేందుకు చాలా సార్లు ప్రయత్నించినా విజీష్ అడ్డుకున్నాడట. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి ఉపయోగం లేకపోయింది. భర్తకు రాజకీయ పలుకుబడి ఉందని సునీష పుట్టింటి వారిని హెచ్చరించింది. ఇటువంటి సమయంలో ఓ రోజు హఠాత్తుగా సునీష నుంచి తన అన్నయ్యకు ఫోన్ వచ్చింది.
తనను అత్తింటి వారు చిత్ర హింసలు పెడుతున్నారని, వెంటనే రావాలని, తెల్లారే సరికి బతికుంటానో లేదో తెలియదని కన్నీళ్లు పెట్టుకుంది. కానీ పుట్టింటి వాళ్లు ఇదీ రొటీన్ గా జరిగేదే కదా, తీరిక చూసుకుని వెళ్దాంలే అనుకున్నారు. కానీ వారం రోజులు తిరిగే సరికి సునీష ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు ఈ కేసు కేరళ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.