హైదరాబాద్- ఈ మధ్య కాలంలో మోసాలు బాగా పెరిగిపోయాయి. దీంతో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో తెయిసడం లేదు. పైగా కొందరు కిలాడీ లేడీలు సైతం మోసాలకు పాల్పడుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో స్కీమ్ ల పేరుతో స్కామ్ చేసిన ఓ కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన పీర్జాదిగూడలోని రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన 32 ఏళ్ల కంకుల పల్లవి రెడ్డి శ్రీ సాయి నిత్య ట్రేడర్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో 2019 లో ఏఎస్ రావునగర్ లో బైక్ షోరూం తెరిచింది.
ఆ తరువాత గత సంవత్సరం దమ్మాయిగూడలోని దోమడుగు గ్రామంలో మరో బైక్ షోరూమ్ ను ప్రారంభించింది. ఈ క్రమంలో స్కీమ్ ల పేరుతో కస్టమర్లను మోసం చేసేందుకు ప్లాన్ వేసింది పల్లవి. మొత్తం మూడు స్కీమ్ లను ప్రవేశపెట్టింది. మొదటి స్కీమ్ లో భాగంగా బైక్ కొనే వారు దాని రేటులో 60 శాతం డబ్బు కడితే 40 శాతం డిస్కౌంట్ ఇస్తామని చెప్పింది. ఇంకేముంది ఆమె మాటలు నమ్మిన కస్టమర్లు చాలా మంది 60 శాతం డబ్బు కట్టారు. తన మాస్టర్ ప్లాన్ లో భాగంగా 20 శాతం డబ్బును కస్టమర్ పేరుపై బ్యాంక్ నుంచి లోన్ తీసి ఆ డబ్బును తన అకౌంట్లో వేసుకుని 12 ఈఎంఐలు తానే కడతానని చెప్పింది పల్లవి.
ఫైనాన్స్ వచ్చిన తర్వాత బైక్ డెలివరీ ఉంటుందని నమ్మబలికింది. 60 శాతం డబ్బు కట్టిన కస్టమర్, మరో నలుగురిని ఈ స్కీమ్ లో చేర్పిస్తేనే డిస్కౌంట్ వర్తిస్తుందని మరో స్కీమ్ కు తెరతీసింది. ఇక రెండో స్కీమ్ లో భాగంగా బైక్ రేటులో 50 శాతం చెల్లించిన కస్టమర్‌కు 100 రోజుల తర్వాత డెలివరీ ఉంటుందని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసింది. మూడో స్కీమ్ లో భాగంగా ఎవరైతే కస్టమర్లు డబ్బులు పెట్టుబడిగా పెడతారో 100 రోజుల తర్వాత వారికి రెట్టింపు డబ్బులు ఇస్తానని నమ్మించింది
కిలాడీ లేడీ పల్లవి రెడ్డి చెప్పిన ఈ మూడు స్కీమ్ లలో దాదాపు 300 మంది చేరి డబ్బులు కట్టారు. భారీగా డబ్బులు వసూలు చేశాక పల్లవి రెడ్డి రెండు బైక్ షోరూమ్ లను మూసేసి ఎంచక్కా చెక్కేసింది. పల్లవి రెడ్డి స్కీమ్స్ లో చేరి మోసోయినట్లు ఈ నెల 11న మౌలాలికి చెందిన మహేశ్వరి అనే మహిళ పోలీసులకు పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన జవహర్ నగర్ పోలీసులు పల్లవి రెడ్డితో పాటు, ఆమెకు సహకరించిన సంజయ్ ను గురువారం అరెస్ట్ చేశారు. సుమారు రెండు కోట్ల రూపాయలు పల్లవి రెడ్డి కస్చమర్ల నుంచి వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.