హిందువులకు ముక్కోటి దేవతలు ఉంటారు. ఇక ఎన్నో పండుగలు ఉంటాయి. ఎన్నో పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో దేవుడ్ని బాగా నమ్ముకుంటారు. ఇష్టదైవం, కులదైవంగా చేసుకుంటారు. ఇక ప్రతీ గ్రామంలో ఎన్నో ఆలయాలు ఉంటాయి. ఇతర దేశాల్లో కూడా హిందూ ఆలయాలు కొన్ని వేలల్లో ఉన్నాయి. అమెరికాకు చెందిన పీవ్ రీసర్చ్ సెంటర్ ఇండియాలో ఉన్న వివిధ మతాలపై సర్వే చేపట్టింది. దేశంలో హిందువులు ఎక్కువగా కొలుస్తున్న ఇష్ట దైవాలపై సర్వే ఆధారంగా నివేదికను రూపొందించింది. ఎక్కువగా హిందువులు శివుడ్ని కొలుస్తున్నారట. దాదాపు సర్వేలో 45 శాతం మంది శివుడ్ని కొలుస్తున్నాం అని తెలిపారు.
తర్వాత హనుమాన్, గణేశ్, లక్ష్మీదేవి, కృష్ణుడు, కాళీమాత, రాముడు ఉన్నారు. హిందువులు అన్నంతనే గుర్తుకు వచ్చే దైవం శ్రీరాముడు. విశేషం ఏమిటి అంటే హనుమంతుడికి 32 శాతం మంది భక్తులు ఉండగా, రాముడిని 17 శాతం మంది భక్తులు పూజిస్తున్నారు. ఇక ఈ సర్వే 2019 నుంచి 2020 మధ్య కాలంలో నిర్వహించారు. మొత్తం 30 వేల మంది నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు.
సర్వేలో పాల్గొన్న హిందువుల్లో 77 శాతం మంది కర్మ సిద్ధాంతాన్ని నమ్మగా 73 శాతం మంది విధిని కూడా బలంగా నమ్ముతున్నట్లు వెల్లడించారు. అదేసమయంలో సర్వేలో పాల్గొన్న ముస్లింలలో 27 శాతం మంది ముస్లింలు పూర్వ జన్మపై నమ్మకం ఉందని చెప్పారు.