కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన అభిమానులను షాక్ గురి చేసిన అమీర్ ఖాన్.. ఇప్పుడు మరో ఫోటోతో ఆందోళన చెందే విధంగా చేశారు. ఓ పెళ్లి వేడుకల్లో పాల్గొన్న ఆయన నించున్న పరిస్థితిని చూసి ఏమైందని అభిమానులు కంగారు పడుతున్నారు.
రాజస్తాన్ లోని జైపూర్ లో జరుగుతున్న ది వాల్డ్ డిస్నీ కంపెనీ ఇండియా, స్టార్ ఇండియా అధ్యక్షుడు కె మాధవన్ కుమారుడి పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకకు బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పటికే అక్షయ్ కుమార్, మలయాళ నటుడు మోహన్ లాల్ చేసిన భాంగ్రా డాన్స్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వేడుకకు కరణ్ జోహార్, అమీర్ ఖాన్, కమల్ హాసన్ ప్రముఖులు పాల్గొని సందడి చేస్తున్నారు. మలయాళ నటుడు పృథ్వీ రాజ్ కుమారన్ తన భార్యతో వచ్చారు. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోలో అమీర్ ఖాన్ పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు సోషల్ సైనికులు.
కె. మాధవన్ కుమారుడి పెళ్లిలో నటులంతా తెల్లని సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్నారు. దక్షిణాది స్టైల్ లుంగీ, కుర్తా, ఫైజామాలను వీరంతా ధరించారు. ఈ ఫోటోల్లో అమీర్ ఖాన్ కూడా సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. అయితే ఆయన వాక్ స్టిక్ సాయంతో నిల్చుని కనిపిస్తుండటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల భోపాల్ లో జరిగిన ఓ వివాహ వేడుకలో కార్తీక్ ఆర్యన్ తో కనిపించిన అమీర్ ఖాన్ ను ఇప్పుడు ఇలా చూసే సరికి ఆయనకు ఏమైందంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. అమీర్ ఖాన్ కాలికి ఏమైంది, ఆయన వాకింగ్ స్టిక్ ఎందుకు ఉపయోగిస్తున్నారంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
అయితే కొంత మంది చిన్న గాయమయ్యి ఉంటుందని భావిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, మరికొంత మంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. లాల్ సింగ్ చద్దా పరాజయం నుండి కోలుకుని, తిరిగి డబ్బులు సంపాదించేందుకు ఇలా పబ్లిక్ స్టంట్ చేస్తున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే దీనిపై ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇటీవల సినిమాలకు తాను కాస్త బ్రేక్ తీసుకుంటానని చెప్పిన సంగతి విదితమే. ఈ వివాహ వేడుకలో నిర్మాత కరణ్ జోహార్ వేసుకున్న దుస్తుల గురించి కూడా నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత కరణ్ హుందాగా ఉండే దుస్తులు ధరించారంటూ కామెంట్లు పెడుతున్నారు. అమీర్ ఖాన్ సినిమాలకు కొంత కాలం దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయం సరైనదంటారా..? కామెంట్ల రూపంలో తెలియజేయండి.