తెలంగాణలో పదో తరగతి పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. తెలుగు పేపర్ లీకేజీ వ్యవహారం మర్చిపోక ముందే మరుసటి రోజు అనగా హిందీ పరీక్ష నాడు కూడా ప్రశ్నా పత్రం సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. దీనిపై వరంగల్ పోలీస్ కమీషనర్ స్పందించారు.
వరుస పేపర్ లీకేజ్ వ్యవహారాలు తెలంగాణకు తలనొప్పిగా మారాయి. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం సద్దుమణగకముందే మరో సమస్య వచ్చి పడింది. సోమవారం నుండి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మొదలైన సంగతి తెలిసిందే. తొలి పరీక్ష మొదలైన కొన్ని నిమిషాలకే తెలుగు పేపర్ నెట్టింట్లో దర్శనమిచ్చింది. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన ఓ టీచర్ ఫోటో తీసి దీన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు తేలింది. ఈ ఘటనపై విచారణ చేపట్టి ముగ్గురు అధికారులను తొలగించారు. అయితే సేమ్ సీన్ రెండవ పరీక్షలో కూడా రిపీట్ అయ్యింది. హిందీ పేపర్ కూడా మంగళవారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.
వరంగల్‌లో హిందీ క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని వరంగల్ పోలీసు కమీషనర్ ఏవీ రంగనాథ్ ధ్రువీకరించారు. పేపర్ బయటకు వచ్చిన విషయం మీడియా ద్వారానే మాకు తెలిసిందన్నారు. అయితే దీన్ని పేపర్ లీకేజ్ కింద పరిగణించలేమని అన్నారు. కాపీయింగ్ కోసమే ఇలా చేసి ఉండొచ్ని అనుమానిస్తున్నామన్నారు. ఈ పేపర్ లీకేజ్‌పై సైబర్ క్రైమ్ దర్యాప్తు చేస్తుందని, సాయంత్రం నాటి కల్లా దోషులెవరో తేలుతారని చెప్పారు. . పరీక్ష మొదలైన గంట తర్వాత వాట్సాప్ గ్రూప్ ద్వారా బయటకు వచ్చిందన్న రంగనాథ్.. దాదాపు సగం పరీక్ష అయ్యాక వచ్చిందని భావిస్తున్నామన్నారు. ఒక మీడియా ఛానెల్ మాజీ రిపోర్టర్ ద్వారా పేపర్ సోషల్ మీడియాలోకి వచ్చిందని తేలిందన్నారు.
అయితే ఆ రిపోర్టర్‌కి ఎక్కడి నుండి వచ్చిందని తేలాల్సి ఉందని అన్నారు. ఇన్విజిలేటర్ ఫోన్ లోపలికి తీసుకెళ్లడం వల్లే పేపర్ బయటికి వచ్చిందని భావిస్తున్నామన్నారు. ఈ అంశంపై విచారణ జరుగుతోంది. సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. సాయంత్రం కల్లా విచారణ పూర్తి చేస్తాం అని కమిషనర్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అయిన పేపర్, ఇవాళ్టి హిందీ పరీక్ష పత్రం ఒక్కటే అని నిర్ధారణ అయింది. అయితే ఎలా బయటకు వచ్చిందో తెలియదంటూ వరంగల్ హన్మకొండ డీఈవోలు వాసంతి, అబ్దుల్‌లు సీపీని కలిసి ఫిర్యాదు చేశారు.