వనపర్తి- ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని కఠిన చట్టాలు చేసినా.. నేరాలు మాత్రం అదుపులోకి రావడం లేదు. అందులోను అమ్మాయిలు, మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో అడపిల్లలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు వణికిపోతున్నారు. ఆఖరికి స్కూల్ కు పంపాలన్నా ఆలోచించే పరిస్థితి వచ్చింది.
స్కూల్ కు వెళ్తున్న ఓ విద్యార్థినిని కొందరు దుర్మార్గులు అపహరించి, అఘాయిత్యావికి పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం మల్లాయపల్లిలో జరిగింది. మల్లాయపల్లికి చెందిన 14 ఏళ్ల విద్యార్థిని పాన్‌గల్ మండలం చింతకుంటలోని జిల్లా పరిషత్ స్కీల్ లో 9వ తరగతి చదువుతోంది. పాఠశాలకు వెళ్లేందుకు ఆ గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో స్వగ్రామం నుంచి రోజూ స్నేహితులతో కలసి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి వస్తోంది.
ఎప్పటిలాగే మంగళవారం ఆ బాలిక తన ఇద్దరు స్నేహితురాళ్లతో కలసి స్కూల్ కు వెళుతుండగా, అదే గ్రామానికి చెందిన నాగరాజు, అనిల్ వేర్వేరు బైక్‌లపై వచ్చి స్కూల్ దగ్గర దింపేస్తామని వారిని నమ్మించారు. అనిల్ ఇద్దరు బాలికలను తన బైక్ పై ఎక్కించుకుని ముందు వెళ్లగా, నాగరాజు మరో బాలికను ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇద్దరు బాలికలను స్కూల్ వద్ద వదిలిపెట్టి తిరిగి వచ్చిన అనిల్ సైతం ఆ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బాధిత విద్యార్ధిని భయపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాలిక ఏడుస్తూ స్కల్ కు వెళ్లి ఉపాధ్యాయులకు విషయం చెప్పడంతో వారు కుటుంబసభ్యులు, గ్రామ సర్పంచ్ జయకళకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఇక ఏ మాత్రం అలస్యం చేయకుండా ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని పోక్సో, అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.