చెన్నై- కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణంతో కన్నడ నాట విషాదం నెలకొంది. పునీత్ రాజ్ కుమార్ సినిమా ఇండస్ట్రీకే కాదు, సమాజంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలలకు సాయం చేయడంతో పాటు, మొత్తం 1800 పిల్లలకు సొంత ఖర్చుతో చదువు చెప్పిస్తున్నారు. మరిప్పుడు పునీత్ రాజ్ కుమార్ వెళ్లిపోయిన నేపధ్యంలో ఆ పిల్లల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది.
ఇదిగో ఇటువంటి సమయంలో పునీత్ రాజ్ కుమార్ మనస్పూర్తిగా చేస్తున్న ఈ విద్యా దానం కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోవడానికి వీలు లేదని అన్నారు తమిళ హీరో విశాల్. పునీత్ రాజ్ కుమార్ ఫ్రెండ్ గా నేనున్నానంటూ ఆయన ముందుకు ముందుకు వచ్చారు. పునీత్ రూజ్ కుమార్ చదువు చెప్పిస్తున్న 1800 పిల్లలకు వచ్చే సంవత్సరం వారి చదువుకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని విశాల్ చెప్పారు.
మరో హీరో ఆర్యతో కలిసి తాను నటించిన సినిమా ఎనిమి ఈ దీపావళి సందర్భంగా నవంబర్ 4న రిలీజ్ అవుతోంది. ఈ సందర్బంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో పునీత్ రాజ్ కుమార్ తో తన స్నేహాన్ని విశాల్ గుర్తు చేసుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ ఓ మంచి వ్యక్తి.. ఆయన లేరనే వార్తను చదివినా, వింటున్నా నమ్మాలనిపించడం లేదు.. కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి.. తన నష్టాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను.. అని అన్నారు విశాల్.
పునీత్ రాజ్‌కుమార్ మరణం కేవలం సినిమా పరశ్రమకే కాదు, సమాజానికి, ఆయనతో అనుబంధం ఉన్నవారందరికి పెద్ద నష్టాన్ని చేకూర్చింది.. పునీత్ లాంటి డౌన్ టు ఎర్త్ పర్సన్ ను నేను ఇండస్ట్రీలో చూడలేదు.. ఆయన ఇండస్ట్రీలో కలిసినా, బయట కలిసినా సరే ఒకేలా ఉంటారు.. నేను చూసిన వారిలో చాలా గొప్ప వ్యక్తి .. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.. ఒక వ్యక్తి ఇన్ని చేయగలుగుతాడా.. అనుకుంటే నమ్మలేం.. అని భావోద్వేగంతో చెప్పారు విశాల్.
పునీత్ రాజ్ కుమార్ 1800 పిల్లల చదువుకు భరోసానిస్తున్నారు.. ఆ అనాథ పిల్లలకు అండగా నిలబడుతున్నారు.. వృద్ధాశ్రమాలకు సాయం చేశారు.. ఆయన చనిపోయిన తర్వాత కూడా తన కళ్లను ఇతరులకు దానం చేసి ఇద్దరికి చూపునిచ్చారు.. ఈ విషయాలను తలుచుకుంటే ఎంతో బాధగా ఉంటుంది.. ఇక పునీత్ రాజ్ కుమార్ చదువు చెప్పిస్తున్న 1800 పిల్లల బాధ్యతను వచ్చే ఏడాది నేను చూసుకుంటానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను.. అని విశాల్ అన్నారు. విశాల్ మంచి మనసుకు తమిళ, కన్నడ సినీ ప్రముఖులు కృతజ్ఞతలు చెప్పారు.