అప్పటి వరకు అమ్మ చాటు బిడ్డలుగా ఆనందంగా జీవిస్తూ వచ్చిన చిన్నారులు వాళ్ళు. నాన్న ప్రేమ లేకపోయినా, అమ్మే వారికి ఏ కష్టం రాకుండా పెంచుకుంటూ వచ్చింది. కానీ.., విధి రాత ఆ బిడ్డల పాలిట శాపం అయ్యింది. అనారోగ్యంతో ఆ తల్లి అకాల మరణం చెందింది. అమ్మ చనిపోవడంతో తండ్రి ఆదరిస్తాడని ఆ ముగ్గురు బిడ్డలు ఆశగా ఎదురుచూశారు. కానీ.., ఆ కసాయి తండ్రి గుండె కరగలేదు. కట్ చేస్తే.. ఇప్పుడు ఆ ముగ్గురు బిడ్డలకు ఏ తోడు లేక, అన్నం పెట్టే దిక్కు లేక.. అంకుల్ మాకు ఆకలి అవుతుందంటూ పోలీసులను ఆశ్రయించారు. తెలుసుకునే కొద్దీ కన్నీరు పెట్టించే ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బి.జీవన్‌కుమార్, దుర్గ దంపతులకు బోర నీరజ(13), నీరజ్(8), నికిల్(8) అనే ముగ్గురు పిల్లలు. భార్యభర్తల మధ్య గొడవలు రావడంతో కొన్నాళ్లుగా వారు విడివిడిగానే ఉంటున్నారు. దుర్గ తన పిల్లలతో కలసి దుర్గానగర్ ప్రాంతంలో నివశిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే అనారోగ్యం కారణంగా దుర్గ మరణించింది. తల్లిలేని ఆ పిల్లల బాధ్యత తీసుకోవడానికి తండ్రి జీవన్‌కుమార్ ముందుకి రాలేదు. తనదారి తాను చూసుకున్నాడు.
దీంతో వీరి ముగ్గురి ఆలనా పాలనా వాళ్ల అమ్మమ్మ చూసేది. కానీ.., ఆమె వృద్ధురాలు కావడం, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుండటంతో పిల్లల్ని పోషించడం ఆమెకి భారంగా మారింది. కొన్ని రోజులు పిల్లల మేనమామ ఆ బాధ్యత తీసుకున్నా, తరువాత అతనికి పెళ్లి కావడంతో.. వచ్చిన భార్య పిల్లలు పోషణకి ఒప్పుకోలేదు. దీంతో మేనమామకి కూడా పిల్లలు భారం అయ్యారు.
ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం పిల్లలు పాఠశాల నుంచి మామయ్య ఇంటికి వెళ్లారు. మేనమామ, అత్తయ్య వాళ్ళని ఇంట్లోకి రానివ్వలేదు. ఏమి చేయాలో పాలుపోక.. ఆ పిల్లలు నడి రోడ్డుపై చాలా సేపు ఉండిపోయారు. కానీ.., ఇంతలో ఇద్దరు తమ్ముళ్ళకి ఆకలి అయ్యింది. 13 ఏళ్ళ అక్క నీరజకి వారి ఆకలిని ఎలా తీర్చాలో అర్ధం కాలేదు. ఆమె వెంటనే తన ఇద్దరు తమ్ముళ్ళని తీసుకుని కంచరపాలెం పోలీస్‌స్టేషన్ కి వెళ్ళింది.
పోలీసులతో అంకుల్ మాకు ఆకలి వేస్తోంది ఏమైనా పెట్టరా అని అడగడంతో పోలీసులు కరిగిపోయారు. అంత చిన్నారులు పోలీస్ స్టేషన్ కి రావడం, ఆకలి అని నోరు తెరిచి అడగడంతో పోలీసులు కూడా చిటికెలో వారికి ఆహారం తెప్పించారు. చిన్నారుల కడుపు నిండాక ఏమి జరిగిందో తెలుసుకున్నారు. పోలీసుల పిలుపుకి కూడా తండ్రి, బంధువులకు స్పందించ లేదు. దీంతో వీరిని సీడ్ ఛైల్డ్‌రైట్ సంస్థకు అప్పగించారు.
సంస్థ సభ్యురాలు మీనాకుమారి ప్రస్తుతం వీరికి ఆశ్రయం కల్పించారు. పిల్లలకు కొవిడ్ పరీక్షలు చేశామని శుక్రవారం ప్రేమ సమాజం స్వచ్ఛంద సంస్థలో చేర్పిస్తామని ఆమె తెలిపారు. చూశారు కదా? తల్లి ఒక్కటి లేకుంటే ఆ బిడ్డల పరిస్థితి ఏమైందో? అందుకే అమ్మని మించిన తోడు ఉండదు అంటారు. మరి.. ఈ చిన్నారుల పరిస్థితిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.