ఇంటర్నేషనల్ డెస్క్- ఆకాశం గురించి అన్నీ చదువుకుని, తెలుసుకున్న ఆస్ట్రొనాట్లే కాదు.. ఆసక్తి ఉన్న మామూలు జనం కూడా అంతరిక్షానికి వెళ్లడానికి కొత్త దారులు తెరుచుకున్నాయి. ప్రముఖ బిజినెస్ మ్యాగ్నెట్ రిచర్డ్ బ్రాన్సన్ చేపట్టిన మిషన్ యూనిటీ 22 వాణిజ్యపరమైన అంతరిక్ష యానాలకు నాందీపలికింది. వీఎస్ఎస్ యూనిటీ వ్యోమనౌకలో వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్, మరో ఐదుగురితో కలిసి ఆదివారం అంతరిక్షంలోకి దూసుకుపోయారు. ఈ యాత్రతో అంతరిక్ష యానంలో ఒక నూతన అధ్యాయం మొదలైంది.
భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటలకు ఈ మిషన్ ప్రారంభం కావాల్సి ఉంది. ఐతే వాతావరణం అనుకూలించక పోవడంతో 90 నిమిషాలు ఆలస్యంగా రాత్రి 8 గంటల తర్వాత ప్రారంభమైంది. అమెరికాలోని న్యూమెక్సికో జోర్నాడా డెల్ ముయెర్టో ఎడారిలో నిర్మించిన స్పేస్ పోర్ట్ అమెరికా బేస్ నుంచి వీఎస్ఎస్ ఈవ్ వాహక విమానం బ్రాన్సన్ బృందంతో కూడిన యూనిటీ స్పేస్‌షిప్ ను మోసుకుంటూ నింగిలోకి దూసుకుపోయింది.
ఆ విమానం గాల్లో సుమారు 13 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లాక, యూనిటీ స్పేస్ షిప్ దాన్నుంచి విడిపోయింది. అది రాకెట్ శక్తితో పనిచేసే వ్యోమనౌక. వీఎంఎఎస్ ఈవ్.. వాహక విమానం నుంచి విడిపోయాక. వీఎంఎస్ యూనిటీ వ్యోమనౌకకున్న రెండు ఇంజన్లను మండించడం ద్వారా వారు మాక్ 3 వేగం అంతే శబ్దానికి మూడు రెట్ల వేగంతో అంతరిక్షంలోకి ప్రయాణించి భూమి నుంచి 88 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్నారు.
స్పేస్ షిప్‌లో ఉన్నవారికి నాలుగు నిమిషాల పాటు భార రహిత స్థితి అనుభవంలోకి వచ్చింది. స్పేస్‌షిప్ కున్న 17 కిటికీల ద్వారా వారు నీలిరంగులో మెరిసిపోతున్న భూమి అంచులను వీక్షించారు. కొన్నినిమిషాలపాటు ఆ అద్భుత అనుభవాన్ని ఆస్వాదించిన తరువాత స్పేస్ షిప్ తిరిగి భూమి వైపు ప్రయాణం మొదలుపెట్టింది. మళ్లీ ఎక్కడి నుంచైతే ఎగిరిందో అదే స్పేస్ పోర్ట్ అమెరికా బేస్‌లోని రన్‌వేపై క్షేమంగా దిగింది. బ్రాన్సన్ బృందం, పైలట్లు అందులోంచి బయటకు వచ్చారు.
పదిహేడేళ్ల కృషి తమను అంత దూరం తీసుకెళ్లిందని బ్రాన్సన్ ఈ సందర్బంగా అన్నారు. మిషన్ విజయవంతమైనందుకు తన బృందానికి శుభాకాంక్షలు ఆయన తెలిపారు. ఇక మన తెలుగమ్మాయి శిరీష బండ్ల ఆస్ట్రోనాట్ 004గా అంతరిక్షపు అంచుల దాకా వెళ్లొచ్చారు. ఆ ఘనత సాధించిన భారత మహిళలు కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ సరసన నిలిచారు గుంటూరుకు చెందిన శిరీష. అంతరిక్ష యాత్రకు వెళ్లిన నాలుగో భారతీయురాలుగా ఆమె చరిత్ర సృష్టించారు. బండ్ల శిరీషకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.