స్పోర్ట్స్ డెస్క్- టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెట్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. బోలాండ్ పార్క్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లీ మరో రికార్డును బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్ లో 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్రికెట్ దిగ్గజం, భారత రత్న సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే ఫార్మాట్ లో విదేశాల్లో సచిన్ టెండుల్కర్ 5065 పరుగులు చేయగా, ఈ మ్యాచ్ లో కోహ్లి ఆ మార్కును దాటేశాడు. దీంతో విదేశాల్లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్ మెన్ గా కొత్త రికార్డు సృష్టించాడు.
మ్యాచ్‌లో నెంబర్ 3 లో బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ 63 బంతుల్లో 3×4 సాయంతో 51 పరుగులు చేసి షంషీ బౌలింగ్‌లో ఔయ్యాడు. ఈ క్రమంలోనే మ్యాచ్‌లో 51 పరుగులు చేయడం ద్వారా భారత్ వెలుపల వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన కోహ్లీ, దక్షిణాఫ్రికాపై అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గానూ ఘనత సాధించాడు.
భారత్ వెలుపల వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా బుధవారం వరకూ సచిన్ టెండూల్కర్ 5065 పరుగులతో టాప్‌లో ఉండగా, బుధవారం తొలి వన్డేలో 9 పరుగులు చేయడం ద్వారా ఆ రికార్డ్‌ని 5066తో బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ, మ్యాచ్‌లో తాను ఔటయ్యే సమయానికి 5,108 పరుగులతో టాప్‌లో నిలిచాడు. కోహ్లీ, సచిన్ తర్వాత ఈ రికార్డ్‌లో మహేంద్రసింగ్ ధోనీ 4520, రాహుల్ ద్రవిడ్ 3998, సౌరవ్ గంగూలీ 3468 పరుగులతో టాప్-5లో కొనసాగుతున్నారు.
దక్షిణాఫ్రికాపై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా ఈరోజు విరాట్ కోహ్లీ మరో రికార్డ్‌ని కూడా నెలకొల్పాడు. తొలి వన్డేకి ముందు వరకూ 1287 పరుగులతో మూడో స్థానంలో ఉన్న కోహ్లీ, 51 పరుగులు చేయడం ద్వారా 1338 రన్స్‌తో గంగూలీ, ద్రవిడ్ రికార్డ్‌లను బ్రేక్ చేశాడు. సఫారీలపై గంగూలీ 1313 పరుగులు చేయగా, ద్రవిడ్ 1309 పరుగులు చేశాడు. కేవలం ఒక్క మ్యాచ్ లో ఈ ఇద్దరి రికార్డ్‌ల్ని కోహ్లీ బ్రేక్ చేశాడు.