తిరుపతి రూరల్- తిరుమల వెంకన్నను దర్శించుకోవాలంటే ఎంత కష్టమో చెప్పక్కర్లేదు. శ్రీవారి దర్శనం కోసం తిరుమల కొండకి వెళ్లి.. క్యూలైన్ లో నిలబడితే ఎన్ని గంటల సమయం పడుతుందో తెలియదు. ఇప్పుడు కాస్త పరవాలేదు కానీ.. గతంలో ఐతే క్యూలైన్ లోనే రెండు రోజులు కూడా గడిచిపోయిన రోజులున్నాయని చెబుతారు చాలా మంది. ఇక ఇప్పుడు టైం స్లాట్ పద్దతి ప్రవేశపెట్టిన నేపధ్యంలో కాస్త త్వరగానే వెంకన్న దర్శనం అవుతోంది. అది కూడా ఒక్కోసారి రెండు గంటల నుంచి 12 గంటల సమయం పడుతుంది. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి ఆ మాత్రం శ్రమపడాలి అంటారు భక్తులు. అదే వీఐపీలైతే ఇలా వెళ్తే అలా దర్శనం చేసుకుని వచ్చేస్తారు. ఇక ఇప్పుడు తిరుమల వెళ్లే భక్తులందరూ వీఐపీలే. అందుకంటే ప్రస్తుతం సామాన్య భక్తులు కూడా వీఐపీల్లాగే శ్రీవారిని దర్శించుకుంటున్నారు. క్యూలైన్లలో ఎలాంటి తోపులాట లేకుండా కేవలం 30 నిమిషాల లోపే స్వామిని దర్శించుకుని బయటకు వస్తున్నారు భక్తులు.
కరోనా ఉదృతి కారణంగా ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ కొనసాగుతోంది. అంతే కాదు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉంది. దీంతో చాలా మంది శ్రీవారి భక్తులు తిరుమల పర్యటనను వాయిదా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాతో పాటు తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు మాత్రమే తిరుమలకు వస్తున్నారు. ప్రతి రోజు 20 వేల మంది శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. కానీ కేవలం 5 వేల మంది లోపే భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. రద్దీ తక్కువగా ఉండడంతో అందరు భక్తులు స్వామిని కనులారా వీక్షిస్తున్నారు. తిరుమల వెళ్లే ప్రతి భక్తుడు వీఐపీ లాగే ఇలా ఆలయంలోకి వెళ్లి అలా శ్రీవారిని దర్శించుకుని వచ్చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేంకటేశ్వర స్వామిని మనసారా దర్శించుకుంటున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఇలాంటి దర్శనం ఎప్పుడూ చేసుకోలేదని, తిరుమల చాలా ప్రశాంతంగా కనిపిస్తోందని భక్తులు అంటున్నారు.