సినిమా అంటే వినోదం అంటారు. కానీ.., సినిమా అంతా వినోదం కావాలంటే మాత్రం..”వినోదం” మూవీ చూడాల్సిందే. కె. అచ్చిరెడ్డి నిర్మాతగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్.వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1996 ఆగస్టు 2న విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా.., నేటితో ఈ చిత్రం 25 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వినోదం అందించిన నవ్వుల జ్ఞాపకాల్లోకి ఒక్కసారి వెళ్ళొద్దాం రండి.
అది 1996వ సంవత్సరం. ఎస్. వి. కృష్ణారెడ్డి మంచి జోరు మీద ఉన్న రోజులు. “మావిచిగురు” లాంటి బ్లాక్ బస్టర్ తో ఇండస్ట్రీని షేక్ చేసి.., మరో సినిమాకి సిద్దమవుతున్నారు ఆయన. చుట్టూ పెద్ద పెద్ద నిర్మాతలు అడ్వాన్స్ లతో సిద్ధంగా ఉన్నారు. డేట్స్ అడిగితే కాదు, లేదు అనే హీరోలే లేరు. దీంతో.. ఈసారి ఎస్. వి. కృష్ణారెడ్డి ఏదో పెద్ద ప్రాజెక్ట్ చేస్తారని అంతా ఊహించారు. కానీ.., అంచనాలకి అందితే ఆయన ఎస్. వి. కృష్ణారెడ్డి ఎందుకు అవుతారు? అందరికీ షాక్ ఇస్తూ.., శ్రీకాంత్ తో “వినోదం” మూవీ అనౌన్స్ చేశారు కృష్ణారెడ్డి. అప్పుడప్పుడే ఎదుగుతున్న రవళిని హీరోయిన్ గా ఫైనల్ చేశారు.
“వినోదం” సినిమాలో భారీ సెట్టింగ్ లు, నేటి తరం సినిమా తాలూకు ట్విస్ట్ లు, భారీ హంగులు ఏమి ఉండవు. ఉన్నదల్లా ప్రేక్షకులను కడుపు చెక్కలయ్యేలా నవ్వించే “వినోదం” మాత్రమే. ఈ చిత్ర కథ చాలా సింపుల్ గా ఉంటుంది. రాజా, అతని స్నేహితులు కలిసి చింతామణి ఇంట్లో అద్దెకుంటుంటారు. చింతామణికి అద్దె ఎగ్గొట్టి అతన్ని నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తారు. ఇంతలో రాజాకి అల అని పిలవబడే అష్టలక్ష్మి పరిచయం అవుతుంది. అష్టలక్ష్మి ధనవంతుడైన బంగారం కూతురు. కూతురు పుట్టాక తనకు బాగా కలిసొచ్చిందని ఆమె ఏదడిగితే అది కాదనకుండా ఇస్తుంటాడు బంగారం. కానీ.., రాజా, అష్టలక్ష్మి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. మరి.. డబ్బు మనిషి అయిన బంగారాన్ని బోల్తా కొట్టించి హీరో తన ప్రేమని ఎలా దక్కించుకున్నాడు అన్నదే చిత్ర కథ.
ఏవీయస్, బ్రహ్మానందం కామెడీ ట్రాక్ “వినోదం” మూవీని మరో మెట్టు ఎక్కించింది. ఈ సినిమాకి గాను బ్రహ్మానందం నంది అవార్డు సొంతం చేసుకోవడం విశేషం. ఇక “వినోదం” చిత్రానికి పాటలే ప్రాణం పోశాయి. “హై లైలా ప్రియురాలా, మల్లెపూల వాన జల్లుల్లోనా, కమ్మగా సాగే స్వరమా” పాటలు అప్పట్లో ఒక ఊపు ఊపేశాయి. ఇక రచయత దివాకర్ బాబు మాటలు సినిమాకి మెయిన్ అసెట్ అని చెప్పుకోవచ్చు. కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి ప్రకాష్ రాజ్, ఏవీయస్, బ్రహ్మానందం, బాబు మోహన్ ఉత్తేజ్ లాంటి బిజీ ఆర్టిస్ట్ లు యాక్ట్ చేసిన ఈ సినిమాని ఎస్. వి. కృష్ణారెడ్డి కేవలం 2 నెలల కాలంలో పూర్తి చేయడం విశేషం. ఇక నటుడిగా బండ్ల గణేశ్ సినీ జీవితం మొదలైంది కూడా ఈ సినిమాతోనే.
ఈ సినిమాతో శ్రీకాంత్ కి లవర్ బాయ్ ఇమేజ్ లభించింది. రవళి కూడా బిజీ హీరోయిన్ అయిపోయింది. అంతేగాక.., “వినోదం” మూవీ నటించిన ఆర్టిస్ట్ లు అందరికీ మంచి పేరు తెచ్చి పెట్టి, నిర్మాతలకి సైతం లాభాల పంట పండించింది. అన్నిటికి మించి ఆల్ రౌండర్ గా ఎస్. వి. కృష్ణారెడ్డి ప్రతిభని మరోసారి చాటి చెప్పి, ప్రేక్షకులను నవ్వుల జల్లులో ముంచెత్తింది.ఇందుకే.. ఇంకో పాతికేళ్ళు అయినా “వినోదం” మూవీకి ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది.