కరోనాతో చతికల పడిన సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంది. తెరకు దూరమైన ప్రేక్షకులు థియేటర్ల వైపు తిరిగి చూసేలా మేకర్స్ మంచి సినిమాలను రూపొందిస్తున్నారు. అయితే మరింత మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు మేకర్స్ పలు బంఫరాఫర్లు ప్రకటిస్తున్నారు. తాజాగా ఓ సినిమా భారీ ఆఫర్ ను ప్రకటించింది.
ఇటీవల కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో భిన్నమైన కథలు వస్తున్నాయి. దీంతో ప్రేక్షకులు సైతం థియేటర్లలో సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే మరింత మందిని థియేటర్లకు రప్పించేందుకు హీరోల నుండి మేకర్స్ వరకు కొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నారు. సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మ భూషణ్ విడుదలై విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఫక్తు సెంటిమెంట్ తో నిలిచిన ఈ సినిమాకు మంచి పబ్లిక్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాను మరింత మందికి తెలిసేందుకు ఆ సినిమా మేకర్స్.. ఈ సినిమాను మహిళలకు మాత్రమే పలు చోట్ల ఉచితంగా షో వేశారు.
ఇప్పుడు మరో సినిమా ఓ బంఫరాఫర్ ను ప్రకటించింది. కిరణ్ అబ్బవరం హీరోగా ఈ శివరాత్రికి విడుదలైన సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ప్రేక్షకులకు ఈ చిత్ర బృందం ఓ సదావకాశాన్ని అందిస్తోంది. ఈ ఆఫర్ కేవలం రెండు రోజులు మాత్రమే వర్తించనుంది. ఇంతకు ఆ ఆఫర్ ఏంటనుకుంటున్నారా.. ఒక్క టికెట్ పై ఇద్దరు సినిమా చూసే అవకాశాన్ని కల్పిస్తోంది. అదీ కూడా బుధ, గురు వారాల్లో మాత్రమే. ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలని వెల్లడించింది. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పించగా.. జీఏ 2 పిక్చర్స్ పతాకంపై రూపొందిన చిత్రమిది. ‘బన్నీ’ వాస్ నిర్మించారు. ఇందులో కశ్మీరా పరదేశి కథానాయికగా నటించారు. మురళీ శర్మ కీలక పాత్ర పోషించారు.
గత రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 5.15 కోట్లను కొల్లగొట్టింది. ఈ సినిమాను నంబర్ నైబర్ కాన్సెప్ట్ మీద సినిమా తీశారు. హీరో హీరోయిన్లు నంబర్ నైబర్ కాన్సెప్ట్ ద్వారా కలవడమే ఈ సినిమా కాన్సెప్ట్. తన మొబైల్ నెంబర్ చివర అంకెకు ముందు, వెనుక నంబర్స్ తీసి హీరోయిన్ కాల్ చేసినప్పుడు ఆమెకు హీరో, మురళీ శర్మ పరిచయం అవుతారు. ఆ తర్వాత ఆమె ఓ ప్రమాదంలో పడినప్పుడు.. ప్రేయసిని కాపాడుకోవడం కోసం నెంబర్ నైబర్స్‌కు ఓ వీడియో ఫార్వర్డ్ చేయమని హీరో రిక్వెస్ట్ చేస్తాడు. అదీ కాన్సెప్ట్! అందుకని, ఒక టికెట్ కొంటే మీ నైబర్ సీట్ (మీ పక్క సీట్) టికెట్ ఫ్రీగా ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్ చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఫిబ్రవరి 22, 23 తేదీల్లో ఎవరైనా సినిమాకు వెళ్ళాలని ప్లాన్ చేస్తే ఒక్క టికెట్ మీద ఇద్దరు చూడవచ్చు. సినిమాలో కిరణ్ అబ్బవరం, మురళీ శర్మ, కశ్మీర మధ్య సన్నివేశాలకు మంచి పేరు వస్తోందని చిత్ర బృందం చెబుతుంది. మురళీ శర్మ, కశ్మీర రీల్స్ సీన్స్ పై ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటున్నారని నిర్మాత బన్నీ వాసు తెలిపారు. ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుందని అన్నారు. ‘భలే భలే మగాడివోయ్’, ‘గీత గోవిందం’, ‘ప్రతి రోజూ పండగే’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’, ‘ఊర్వశివో రాక్షసివో’, ’18 పేజెస్’ వంటి విజయవంతమైన సినిమాల తర్వాత జీఏ 2 పిక్చర్స్ సంస్థలో మరో కమర్షియల్ సక్సెస్ ఇది. ఈ ఆఫర్ ప్రకటిచడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.