హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధానంగా ఆమె కేసీఆర్ జిల్లాల్ల పర్యటనలపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే జిల్లాల పర్యటనలు కాలక్షేపాన్ని తలపిస్తున్నాయని విజయశాంతి ఎద్దేవా చేశారు. హుజురాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతున్న నేపధ్యంలో, కేసీఆర్ కు అక్కడికి వెళ్లే ధైర్యం లేక చుట్టుపక్కల జిల్లాల్లో పర్యటిస్తున్నారని ఆమె కామెంట్ చేశారు. కేసీఆర్ పిచ్చి టూర్లు, మోసపు వాగ్దానాల వలన ప్రజలకు ఒరిగేదేమీ లేదని విజయశాంతి వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనలు ఆప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని విజయశాంతి అన్నారు. రైతులు, విధ్యార్ధుల అరెస్టులు, వేధింపుల కోసమే అన్నటుగా కేసీఆర్ పర్యటన ఉందని ఆమె కామెంట్ చేశారు. ప్రజల్ని రోడ్ల మీదకు రానివ్వకుండా ఎక్కడిక్కడ బారికేడ్లు పెట్టి అడ్డుకోవడం కేసిఆర్‌కే చెల్లిందని విజయశాంతి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ జిల్లాలకు వస్తే ఇంత నిర్బంధం ఉంటుందంటే, ఆయన ఫామ్‌హౌస్‌లో ఉండడమే మంచిదని ప్రజలు అంటున్నారని ఆమె చెప్పారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపధ్యంలో కొందరు పోలీసు అధికారుల తీరుపై విజయశాంతి ఫైర్ అయ్యారు. కనీసం ప్రతిపక్ష నాయకులనే గౌరవం లేకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారని అన్నారు. అది వారికి మంచిది కాదమి హితువు పలికారు. అయినా పేరుకి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తప్ప ఈ ప్రచార ఆర్భాటపు ముఖ్యమంత్రి గారి కాలక్షేపం పర్యటన వల్ల ప్రజల, నిరుద్యోగుల గతి మారుతున్నది ఏమీ లేదని విజయశాంతి వ్యాఖ్యానించారు.