హైదరాబాద్- కరోనా మహమ్మారికి విరుగుడు వ్యాక్సిన్ ఒక్కటేనని వైద్య నిపుణులు చెబుతూ వస్తున్నారు. ఐతే మన దేశంలో 140 కోట్ల మేర జనాబా ఉండటంతో అందుకు అనుగునంగా వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి రావడం లేదు. మన దేశంలో రెండు కంపేనీలు సీరం ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తున్నా.. సగం విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దీంతో కరోనా టీకా కోసం అంతా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. భారత్ లో ఇప్పటి వరకు సుమారు 20 కోట్ల మందికి మాత్రమే వ్యాక్సిన్ వేశారు. అందులో రెండు డోసులు తీసుకున్న వారు కేవలం 6 కోట్ల మంది మాత్రమే. ఈ లెక్కన అందరికి వ్యాక్సిన్ ఇవ్వాలంటే మాత్రం రెండేళ్లు పట్టనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికి కరోనా వ్యాక్సిన్ వేయాలని కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించింది. కానీ దేశంలోని చాలా రష్ట్రాల్లో కరోనా టీకా నిల్వలు లేకపోవడంతో 18 ఏళ్ల పైబడిన వారెవ్వరికీ టీకా వేయడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఓ వెసులుబాటు కల్పించింది. ప్రైవేట్ సంస్ధలు 18 ఏళ్లు పైబడిన తమ తమ ఉగ్యోగులకు కరోనా టీకా వేయించుకునేందుకు తెలంగాణ ప్రభుత్నం అనుమతినిచ్చింది. వ్యాక్సినేషన్ కోసం ప్రైవేటు ఆస్పత్రులతో ప్రైవేటు సంస్థలు అనుసంధానం అయి ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించుకోవచ్చునని సర్కార్ తెలిపింది.
ఈ మేరకు 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు కరోనా వ్యాక్సిన్ వేసేందుకు అన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మార్గదర్శకాలను అనుసరించి ప్రైవేటు కంపెనీలు, కార్పొరేట్ సంస్థల అభ్యర్థన మేరకు ప్రైవేటు ఆస్పత్రులు టీకా డ్రైవ్‌లు నిర్వహించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణలో జనవరి 16న కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, ముందు పారిశుద్ధ్య, వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చారు. తర్వాత 60 ఏళ్లు నిండిన వారికి, ఆ తర్వాత 45 ఏళ్లు పైబడిన వారికి టీకా వేస్తున్నారు.