న్యూ ఢిల్లీ- కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోతోంది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించారు. చాలా రోజుల నుంచి క్యాబినెట్ విస్తరణపై కసరత్తు చేస్తున్న మోదీ ఎట్టకేలకు ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలన్నదానిపై ప్రధాని జాబితా సిద్దం చేసుకున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక కేంద్ర మంత్రివర్గ విస్తరణ బుధవారం జరగనున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. ఈ మేరకు అధికార యంత్రాంగానికి ప్రధాని కార్యాలయం నుంచి సంకేతాలు అందినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈనెల 7న ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య విస్తరణ కార్యక్రమం ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ సారి క్యాబినెట్ లో కొత్తగా 20 మందికి చోటు దక్కనున్నట్లు సమాచారం.
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న నేపధ్యంలో యూపీ నుంచి ఎక్కువ మందికి మంత్రివర్గంలో స్థానం దక్కవచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని రోజులుగా ప్రధాని మోదీ వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు వారి వారి శాఖల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
ఈ భేటీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఇక మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా 7 నుంచి 8 మంది కేంద్ర మంత్రులను మోదీ తొలగించనున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరినీ కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది.