హైదరాబాద్- తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ ఆ పార్టీని వీడబోతున్నారు. ఈ మేరకు అధికార టీఆర్ ఎస్ పార్టీలో ఎల్ రమణ చేరబోతున్నారు. ఇందులో భాగంగానే ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఎల్ రమణ భేటీ అయ్యారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ఆయన సీఎం కేసీఆర్ ను కలిశారు.
ఈ మేరకు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణను ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ ఎస్ పార్టీలోకి అహ్వానించారు. అందుకు ఎల్ రమణ సానుకూలంగా స్పందించారు. మంచి ముహూర్తం చూసుకుని టీఆర్ ఎస్ పార్టీలో చేరతానని రమణ కేసీఆర్ కు చెప్పినట్లు తెలుస్తోంది. సామాజిక తెలంగాణ కోసం పాటుపడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు సూచించినట్లు ఎల్ రమణ చెప్పారు.
ఇక తెలంగాణలో తెలగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఎల్ రమణ అంటే సీఎం కేసీఆర్ కు ప్రత్యేక అభిమానమని ఆయన చెప్పారు. అందుకే ఎల్ రమణను టీఆర్ ఎస్ పార్టీలి అహ్వానించారని తెలిపారు. త్వరలోనే ఎల్ రమణ కారెక్కుతారని ఎర్రబెల్లి చెప్పారు. ఇక ఎల్ రమణ హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక తాను టీడీపీ పార్టీని ఎందుకు వీడాల్సి వస్తుందన్నదానిపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వివరించేందుకు ఎల్ రమణ గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఈమేరకు పలు మార్లు చంద్రబాబును కలిసేందుకు అపాయింట్ మెంట్ అడిగారు. ఐతే ఎల్ రమణను కలిసేందుకు చంద్రబాబు అంత సుముఖంగా లేరని తెలుస్తోంది. అందుకే ఎల్ రమణకు చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని సమాచారం.