తిరుపతి రూరల్- తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులకు టీటీడీ ఓ వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే తిరుమల వెళ్లేందుకు ప్రత్యేక ప్రవేశ దర్శం టిక్కెట్లు ఎవరైతే బుక్ చేసుకున్నారో, లాక్ డౌన్ వళ్ల తిరుమల వెళ్లలేకపోతున్నామని కంగారు పడాల్సిన పని లేదు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్ తేదీ మార్చుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అవకాశం కల్పించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి మే 31 వరకు ఆన్‌లైన్‌లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు తమ దర్శన తేదీని మార్చుకునేందుకు టీటీడీ వీలు కల్పించంది. అయితే సంవత్సరం లోపు కేవలం ఒకసారి మాత్రమే ఈవిధంగా దర్శనం తేదీని మార్పునకు అవకాశం ఉంటుందని టీటీడీ తెలిపింది. కరోనా వ్యాప్తి ఉండట, లాక్ డౌన్ నేపధ్యంలో స్వామివారి భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఇక భక్తులు ఈ వెసులుబాటును ఉపయోగించుకుని, ఇప్పటితే దర్శనం టిక్కెట్ బుక్ చేసుకున్న వారు తదుపరి అనుకూలమైన తేదీకి దర్శనాన్ని మార్చుకోవాలని టీటీడీ సూచించింది. ఇక తిరుమలలో భక్తుల రద్దీ అంతకంతకు తగ్గిపోతోంది. మంగళవారం శ్రీవారిని కేవలం 2 వేల 262 మంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 11 లక్షలకు పడిపోయినట్లు టీటీడీ తెలిపింది. మంగళవారం 925 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. కరోనా నేపధ్యంలో స్వామివారి సర్వదర్శనం టికెట్ల జారీని టీటీడీ రద్దు చేసింది. కేవలం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఉన్నవారిని మాత్రమే అలిపిరి నుంచి తిరుమల కొండపైకి అనుమతిస్తున్నారు.