తిరుపతి- కలియుగ దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది. ఆంద్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరగడంతో పాటు, లైక్ డౌన్ విధించడం, ఇతర రాష్ట్రాల్లోను లాక్ డౌన్ కొనసాగుతుండటంతో శ్రీవారి దర్శనానికి భక్తులు రావడం లేదు. రోజుకు మూడు నుంచి నాలుగు వేల మంది మాత్రమే స్వామిని దర్శించుకుంటున్నారు. దీంతో టీటీడీ ఘాట్ రోడ్డుతో పాటు, తిరుమల కాలిబాటల మరమ్మత్తులపై దృష్టి సారించింది. ఈమేరకు అలిపిరి నడక మార్గాన్ని మూసి వేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. మరమ్మత్తుల కారణంగా అలిపిరి నడక మార్గాన్ని మూసివేస్తున్నామని టీటీడీ స్పష్టం చేసింది.
కాలినడకన కొండపైకి వెళ్లాలనుకునే భక్తులు శ్రీవారి మెట్ల మార్గం గుండా వెళ్లాలని టీటీడీ సూచించింది. శ్రీవారి మెట్టు మార్గానికి భక్తులు చేరుకునేందుకు ఉచిత బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రెండు నెలల కాలంలో అలిపిరి కాలినడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులను పూర్తి చేయనున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్‌లో కూడా అలిపిరి మెట్ల మార్గంలో మరమ్మత్తులు చేసింది టీటీడీ. అయితే ఆ సమయంలో యధావిధిగా భక్తులను అనుమతించారు. ఐతే ప్రస్తుతం లాక్ డౌన్, కరోనా వ్యాప్తి కారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ తక్కువగా ఉంది. దీంతో అలిపిరి నడక మార్గాన్ని రెండు నెలలు పూర్తిగా మూసివేసి మరమ్మతులు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. అలిపిరి నడక మార్గం పదకొండు కిలోమీటర్ల పొడవు ఉంటుంది.
ఇదే కొండపైకి వెళ్లేందుకు ప్రధానమైన నడకమార్గం. అలిపిరి నుంచి గాలిగోపురం వరకున్న సోపాన మార్గాన్ని మట్లి అనంతరాజు నిర్మించాడని చెబుతారు. ప్రాచీన కాలంలో అలిపిరి నుంచి సామాన్యులు తిరుమల కొండ ఎక్కడానికి గుర్తుగా మానవాకృత బాట గుర్తులు ఏర్పాటు చేశారు. ఆ గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయి. అలిపిరి నడక మార్గంతో పాటు చంద్రగిరి నుంచి ప్రారంభమయ్యే శ్రీవారి మెట్టు నుంచి భక్తులు తిరుమలకు వెళ్తుంటారు. ఇది కేవలం 6 కిలోమీటర్ల దూరమే అయినా అలిపిరి మార్గము కంటే క్లిష్టంగా ఉంటుందని చెబుతారు భక్తులు. దీంతో 11 కిలోమీటర్ల దూరం అయినా భక్తులు అలిపిరి మార్గాన్నే ఎంచుకుంటారు.