స్పెషల్ స్టోరీ- ఒక్కోసారి రాజకీయ నాయకులు ఏం మాట్లాడినా అది వివాదం అవుతుంది. వాళ్లు వేరే ఉద్దేశ్యంతో మాట్లాడితే అతి వేరే అర్ధానికి దారితీస్తుంది. ఇక ఇప్పుడు అసలే సోషల్ మీడియా బాగా యాక్టీవ్ లో ఉంది. ఈ టైంలో ఏ మాత్రం ఏమరపాటుగా మాట్లాడినా ఇక అంతే సంగతులు. ఒక్క మాట కాస్త అటూ, ఇటుగా మాట్లాడినా అది ఎంత పెద్ద వివాదానికి దారితీస్తుందో చాలా సందర్బాల్లో చూశాం. తాజాగా టీఆర్ ఎస్ ఎమ్మెల్యే ఒకరు ఉద్యోగాల విషయంలో ఇలాగే మాట్లాడి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఉగ్యోగాల విషయంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో టీఆర్ ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిందని ప్రతిపక్షాలు గుర్తు చేస్తున్నారుయ ఆమేరకు వెంటనే ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకు అనుగునంగా అప్పుడప్పుడు ధర్నాలు, నిరసనలు సైతం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు.
కొత్తగా వైఎస్ షర్మిల ఆధ్వర్యంలోని వైఎస్సార్‌టీపీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తోంది. అంతే కాదు షర్మిల వారానికో రోజు నిరుద్యోగ దీక్ష కూడా చేపట్టారు. ఇదిగో ఇటువంటి సమయంలో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటికో ఉద్యోగం సాధ్యం కాదని, విపక్షాలు ఉద్దేశపూర్వకంగానే నిరుద్యోగులను గందరగోళానికి గురిచేస్తున్నాయని ఆయన అన్నారు. ఉద్యోగాల భర్తీ వ్యవహారంపై చర్చ జరగాలని కామెంట్ చేశారు. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం సాధ్యపడే విషయం కాదని, ఈ విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసన్నారు లక్ష్మా రెడ్డి.
అంతటితో ఊరుకోకుండా.. అందరికీ ఉద్యోగాలిస్తామని రాసిస్తే.. ఆర్నెల్లు ప్రతిపక్ష పార్టీలకు ప్రభుత్వాన్ని అప్పగిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు జాతీయ పార్టీల నుంచి లేఖలు తీసుకొస్తారా అని కాంగ్రెస్, బీజేపీ నేతలకు ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి సవాల్ విసిరారు. ఇదేమి అర్జున్ నటించిన ఒకేఒక్కడు సినిమా కాదని, మాటలు మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడాలని టీఆర్ ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి హితువు పలుకుతున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు.