చిత్తూరు- భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మేజర్ బిపిన్ రావత్ తమిళనాడు లోని కున్నూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు మరో 11 మంది అంటే మొత్తం 13 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు.
ఈ హెలికాప్టర్ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాయితేజ్ మృతి చెందడంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. సాయితేజ్ స్వస్థలం చిత్తూరు జిల్లా కురబాలకోట మండలం ఎగువరేగడ గ్రామం. సాయితేజ్ రక్షణ శాఖలో లాన్స్ నాయక్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం సీడీఎస్ బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా సాయితేజ్ విధుల్లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది.
సాయితేజ్ 2013లో ఆర్మీలో జాయిన్ అయ్యాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన మోహన్, భువనేశ్వరి దంపతులకు జన్మించిన ఇరువురు కుమారులు రక్షణ శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. మొదటి కుమారుడు సాయి తేజ కాగా, రెండవ కుమారుడు మహేష్ బాబు ఆర్మీలో ఉండగా సిక్కింలో ఉద్యోగం నిర్వర్తిస్తున్నాడు. ఇప్పుడు ఇలా హెలికాప్టర్ ప్రమాదంలో పెద్ద కొడుకు సాయి తేజ చనిపోవడంతో తల్లి దండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
సాయితేజకు 2015 లో సిద్ధారెడ్డి పల్లికి చెందిన శ్యామల తో వివాహం జరిగింది. సాయితేజ్‌కు భార్య, నాలుగేళ్ల కుమార్తె, రెండేళ్ల వయసున్న కుమారుడు ఉన్నారు. సాయితేజ్ మరణంతో ఆయన కుటుంబంతో పాటు, ఎగవరేగడ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇక సాయి తేజ పార్దీవదేహం కోసం కుటుంబంతో పాటు ఊరు ఊరంతా ఎదురుచూస్తోంది. రేగడి గ్రామానికి భారత వైమానిక అధికారులు రానుండడంతో ముదివేడు ఎస్ ఐ సుకుమార్ ఏర్పాట్లు చేస్తున్నారు.