విజయనగరం- ఓ యువతి, యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు ప్రతిరూపంగా ఓ పాప కూడా పుట్టింది. సాఫీగా సాగుతున్న వారి కాపురంలో తాగుడు చిచ్చుపెట్టింది. చివరికి వారి జీవితాల్లో విషాదాన్ని మిగిల్చింది. ఈ హృదయ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలోలో జరిగింది.
కొత్తవలస మండలం కొత్తవలస మేజరు పంచాయతీ పరిధి 202 కాలనీకి చెందిన కొటాన 29 ఏళ్ల ప్రవీణ్ స్థానికంగా పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. అదేకాలనీలో ఉంటున్న 20 ఏళ్ల కోట తనూజ సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. వీరి ప్రేమ సంగతి ఇద్దరి ఇళ్లల్లో తెలియడంతో పెద్దలు పంచాయితీ పెట్టారు.
అమ్మాయి ఇంట్లో వారి ప్రేమను అంగీకరించలేదు. అంతే కాదు అమ్మాయి కుటుంబం విశాఖపట్నంకు మకాం మార్చింది. అయినా వీరి ప్రేమ అలాగే కొనసాగింది. ఆఖరికి ఓ రోజు ఇంట్లో చెప్పకుండా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరి కాపురానికి గుర్తుగా పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ప్రవీణ్ కుమార్ తండ్రి చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్లిపోగా, తల్లి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. కొన్నిరోజులు అన్యోన్యంగా సాగిన వీరి కాపురంలో ప్రవీణ్ చెడు వ్యసనాలు చిచ్చురేపాయి.
పెళ్లికి ముందు నుంచే మద్యం అలవాటున్న ప్రవీణ్, పెళ్లి అయ్యాక ప్రతి రోజు తాగడం మొదలుపెట్టాడు. పేయింటింగ్ పని ద్వార వచ్చే ఆదాయం తక్కువ కావడంతో, రోజూ డబ్బులు కోసం భార్య, తల్లిని వేధించేవాడు. డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేసేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కూడా మందు కోసం డబ్బులు ఇవ్వాలని తల్లి, భార్యతో గొడవపడ్డాడు ప్రవీణ్ కుమార్.
ఇవి ఎప్పుడూ ఉండే బెదిరింపులేనని వారు లైట్ తీసుకున్నారు. రాత్రి భోజనం చేశాక ప్రవీణ్ తల్లి, భార్యా బిడ్డలు పడుకున్నారు. ఉదయం లేచి చూసేసరికి ప్రవీణ్ ఇంట్లోని మరో గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు. భర్త మృతదేహం వద్ద తనూజ రోదనలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి. ఇకపై తాను, బిడ్డ బతికేదెలా అని వెక్కి ఏడ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.