పదిలంగా ఉండాల్సిన చిట్టి గుండె గట్టిగా కొట్టుకుని మనుషుల ప్రాణాలను బలిగొంటుంది. సామాన్యుడు నుండి సెలబ్రిటీల వరకు దీని బారిన పడిన వారే. కరోనా, దాని అనంతర పరిస్థితులు తర్వాత గుండె మరింత బలహీన పడుతోంది.
పదిలంగా ఉండాల్సిన చిట్టి గుండె గట్టిగా కొట్టుకుని మనుషుల ప్రాణాలను బలిగొంటుంది. సామాన్యుడు నుండి సెలబ్రిటీల వరకు దీని బారిన పడిన వారే. కరోనా, దాని అనంతర పరిస్థితులు తర్వాత గుండె మరింత బలహీన పడుతోంది. కరోనా సమయంలోనే కన్నడ నటుడు అర్జున్ సర్జా మేనల్లుడు చిరంజీవి సర్జా కన్నుమూసిన సంగతి తెలిసిందే. బిడ్డను చూసుకోకుండా హార్ట్ ఎటాక్‌తో మరణించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక మంది సెలబ్రిటీలను పొట్టనపెట్టుకుంది. అంతేకాకుండా 30 ఏళ్లు నిండని వారిని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వారిని సైతం హార్ట్ స్ట్రోక్ మెలిపెడుతుంది. అనంతరం గుండెలను పిండేసి.. తేరుకునేలోపే కానరాని లోకాలకు తీసుకెళిపోతుంది.
ఇటీవల కన్నడ దర్శకుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన కూడా గుండెపోటుతో మరణించిన సంగతి విదితమే. ఆనందంగా గడుపుదామని బ్యాంకాక్ వెళితే.. విషాదాన్ని నింపింది. ఇప్పుడు మరో యువతి కూడా సంతోషంగా డ్యాన్సులు వేస్తున్న సమయంలో హార్ట్ స్ట్రోక్‌తో కుప్పకూలిపోయింది. ఆ ఇంట్లో శోక సంద్రాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా గంగాధర్‌లోని మోడల్ స్కూల్లో వెంకటాయపల్లి గ్రామానికి చెందిన గుండు అంజయ్య కూతురు ప్రదీప్తి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. తొలి నుండి ఆట పాటలంటే ఆమెకు చాలా ఇష్టం. ఈ నేపథ్యంలో కాలేజీలో ఫ్రెషర్స్ డే నిర్వహించారు. పార్టీలో తోటి విద్యార్థులకు కలిసి ప్రదీప్తి ఉత్సాహంగా డ్యాన్సు చేసింది.
అంతలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తోటి విద్యార్థులు, కాలేజీ యాజమాన్యం వెంటనే గమనించి, ఆమెకు శ్వాస ఆడటం లేదని గ్రహించి.. సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమెను గుండె పోటు బలితీసుకుంది. ఈ విషయం తెలిసిన తోటి విద్యార్థులు కన్నీరు మున్నీరు అయ్యారు. అప్పటి వరకు తమతో ఆడుతూ పాడుతూ హుషారుగా డ్యాన్స్ చేసిన యువతి ఇప్పుడు విగత జీవిగా మారిపోవడంతో కంటతడి పెట్టారు. ఆమె ప్రాణ స్నేహితులు అయితే గుక్కపెట్టి ఏడ్చారు. ప్రదీప్తి స్వగ్రామంలో కూడా విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె గుండెకు రంధ్రం ఉన్నట్లు ప్రాథమిక నిర్దారణలో తేలింది.