Hyderabad: ట్రాఫిక్ రూల్స్ సరిగా పాటించకపోతే చలాన్లు పడతాయన్న సంగతి తెలిసిందే. ఒక్కో రూల్ అతిక్రమిస్తే.. ఒక్కో రకంగా చలాన్ పడుతుంది. హెల్మెట్ దగ్గరినుంచి పొల్యూషన్ సర్టిఫికేట్ వరకు ఒక్కో దానికి ఒక్కో రకమైన ఫైన్ ఉంటుంది. కొత్తగా మరికొన్ని రూల్స్‌ను తీసుకువచ్చారు. వాటిని అతిక్రమిస్తే ఫైన్లను వేయనున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర స్టాప్‌లైన్ దాటితే 100 రూపాయల ఫైన్.. ఫ్రీ లెఫ్ట్‌కు ఆటంకం కలిగిస్తే 1000 రూపాయల ఫైన్.. పాదచారులకు ఇబ్బంది కలిగిస్తే 600 రూపాయల ఫైన్ వేస్తున్నారు. అయితే, ఈ కొత్తగా తెచ్చిన రూల్స్‌పై సోషల్ మీడియా వేదికగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
నెటిజన్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వానికి డబ్బులు అవసరమైనపుడు ఇలా చేస్తుంటారని, ట్రాఫిక్ పోలీసులతో చలాన్లు వేయిస్తారని ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్‌పై ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ స్పందించారు. ఆయన సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘పండుగ సందర్బంగా డబ్బులు దండుకోవటానికి చలాన్లు అని మీరు అన్నారు. మేము వేసిన మొత్తం చలాన్లు మూడు వేలో.. నాలుగు వేలో ఉంటాయి. దీనిపై మేము ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చాము. ఈ వారంలో ఒక ఐదు వేలు ఉండొచ్చు. అది కూడా ఫ్రీ లెఫ్ట్ టు స్టాప్‌లైన్ రూల్స్‌పై ఐదు వేల నుంచి పది వేలు ఉంటాయి.
హైదరాబాద్ పోలీసులు రోజుకు మొత్తం ఎన్ని చలాన్లు వేస్తారో తెలుసా? పాతిక వేలు పైనే వేస్తారు. వీటి మీద వేసేది ఐదు వేలో, పది వేలో ఉంటుంది. తక్కిన వాటితో పోల్చుకుంటే ఇవి నథింగ్. జీతాల కోసమే రోడ్ల మీదకు వచ్చి చలాన్లు వేస్తున్నారని జనం అనుకుంటున్నారు. 5 ఏళ్లు, పదేళ్లు పెండింగ్‌లో ఉన్న చలాన్ల నుంచి ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 300 కోట్ల రూపాయలు. కానీ, పోలీస్ శాఖ బడ్జెట్ ఓ సంవత్సరానికి 7నుంచి 8 వేల కోట్ల రూపాయలు ఉంటుంది. ఇది సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు పనికొచ్చే అంశం మాత్రమే. సోషల్ మీడియాలో వచ్చేవన్నీ ఒట్టి ఆరోపణలు మాత్రమే’’ అని అన్నారు.