తిరుమల- కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో టీటీడీ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. గతంలో ప్రకటించిన మేరకు తిరుమలలో భక్తుల కోసం సంప్రదాయ భోజన కార్యక్రమాన్ని గురువారం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. ఇది శ్రీవారి భక్తులకు అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు.
పూర్తిగా గో ఆధారిత వ్యవసాయం ద్వారా ఆర్గానిక్ పద్దతిలో పండించిన ఉత్పత్తులతో అన్నప్రసాదాలను తయారు చేస్తోంది టీటీడీ. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ముందు మీడియా ప్రతినిధులకు, టీటీడీ సిబ్బందికి ఈ సంప్రదాయ భోజనాన్ని వడ్డించారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రం చాలా బావుందని, భోజనం రుచికరంగా ఉందని మీడియా ప్రతినిధులు, టీటీడీ సిబ్బంది చెప్పారు.
ఇక సంప్రదాయ భోజనంలో రెండు రకాల దేశీయ వరి బియ్యంతో అన్నం, పూర్ణం బూరెలు, బెల్లం పొంగలి, దోసకాయ పచ్చడి, బీరకాయ ప్రై, కొబ్బరన్నం, పులిహోర, బీన్స్ ఫ్రై, వడలు, పప్పు, సాంబారు, రసం వడ్డించారు. అన్ని వంటకాలు అధ్భుతమైన రుచితో ఉన్నాయని తెలిపారు. సేంద్రియ ఆహారం విశిష్ఠత తెలిసేలా కాస్ట్ టూ కాస్ట్ పద్ధతిలో భక్తులకు సంప్రదాయ భోజనం అందించాలని టీటీడీ నిర్ణయించింది.
ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ సంప్రదాయ భోజన కార్యక్రమం 8 రోజుల పాటు పరిశీలించిన తర్వాత, తిరుమలలో ఏయే ప్రదేశాల్లో కౌంటర్లు ఏర్పాటు చేయాలి, భోజనం ఎంత ధరకు విక్రయించాలనే అంశాలపై టీటీడీ నిర్ణయం తీసుకోనుంది. సంప్రదాయ భోజనాన్ని సెప్టెంబరు 8 నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ ఏర్పాట్లు చేస్తోంది. మీరు గనుక తిరుమల వెళ్తే తప్పకుండా సంప్రదాయ బోజనం రుచి చుడటం మరిచిపోకండి.