హైదరాబాద్-అమరావతి- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటీషన్ రద్దు కేసుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అక్రమ ఆస్తుల కేసులో జగన్ ప్రస్తుం బెయిల్ పై ఉన్నారు. సీబీఐ కేసు ఎదుర్కొంటున్న సీఎం జగన్ గతంలో 17 నెలల పాటు జైళ్లో ఉన్నారు. ఆ తరువాత కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన బయటకు వచ్చారు. ఆ తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో గెలిచి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు జగన్.
ఐతే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ బెయిల్ నిబంధనలు ఉల్లంగిస్తున్నారని, అందుకని ఆయన బెయిల్ ను వెంటనే రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. బెయిల్ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని పిటీషన్ లో కోరారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ వివిధ కారణాలు చెబుతూ, కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారని రఘురామ కృష్ణరాజు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు పలు సార్లు విచారించింది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. అప్పటి నుంచి సీబీఐ కోర్టు రీర్పును రిజర్వు చేసింది. ఈ పిటిషన్‌పై ఈ రోజు బుధవారం ఆగష్టు 25న సీబీఐ కోర్టులో తుది విచారణ కొనసాగనుంది. ఆ తరువాత కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది.
దీంతో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై సీబీఐ కోర్టు ఏం తీర్పు చెప్పబోతోందోననే ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో సీబీఐ కోర్టు తీర్పుపై ఆందోళన కనిపిస్తోంది. జగన్ బెయిల్ రద్దైతే తరువాత పరిస్థితి ఎంటన్న చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. ఐతే జగన్ మాత్రం బెయిల్ రద్దు కాదనే ధీమాతో ఉన్నారని తెలుస్తోంది.