బిజినెస్ డెస్క్- దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభి, లాభాల్లో ముగిశాయి. నిన్న పైకి ఎగబాకిన సెన్సెక్స్ నేడు మరింతగా ఎగసి ఏకంగా 50 వేల మార్కును దాటింది. అటు నిఫ్టీ సైతం 15 వేల పాయింట్లను దాటింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూలతలు, దేశంలో రోజువారీ కరోనా కేసులు తగ్గుతుండడం, డీఆర్ డీఓ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సంయుక్తంగా విడుదల చేసిన 2డీజీ ఔషధం వంటి పరిణామాలు స్టాక్ మార్కెట్‌కు కలిసి వచ్చినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్చి 12 తరువాత నిఫ్టీ మొదటిసారి 15 వేల పాయింట్లను దాటడం విశేషమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ట్రేడింగ్ ముగిసే సమయానికి 184.95 పాయింట్లతో 1.24 శాతం లాభంతో 15,108.10 వద్ద ముగిసింది. అదే సమయంలో సెన్సెక్స్ 612.60 పాయింట్లుతో 1.24 శాతం పెరుగుదలతో 50,193.33 వద్ద స్టిర పడింది. దీంతో మధుపరుల సంపద నిమిషాల్లో 2.2 లక్షల కోట్ల మేర పెరిగింది.
కేఈఐ ఇండస్ట్రీస్, వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్, ప్రజ్ ఇండస్ట్రీస్, టీసీఐ ఎక్స్‌పోర్ట్స్ షేర్లు భారీ లాభాల్లో ముగియగా, ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ మేనేజ్ మెంట్, హింద్ కన్‌స్ట్రక్షన్ కో, హెస్టర్ బయోసైన్స్, కెనరా బ్యాంక్, బజాజ్ హిందూస్థాన్ షుగర్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇక ఫెడరల్ బ్యాంక్ షేర్లు మంగళవారం 6 శాతం మేర పెరిగాయి. మార్చి 2021 త్రైమాసికంలో ఫెడరల్ బ్యాంక్ నికర లాభం 59 శాతం పెరిగి 478 కోట్ల రూపాయలకు చేరుకుంది. రేపు కూడా షేర్ మార్కెట్లు ఆశాజనకంగా ఉండవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.